Begin typing your search above and press return to search.

బాబు వస్తే జాబు వచ్చిందా..: పవన్

By:  Tupaki Desk   |   7 Jun 2018 10:36 AM GMT
బాబు వస్తే జాబు వచ్చిందా..: పవన్
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం విశాఖ జిల్లా పాడేరు గిరిజన మన్యం ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాడేరు మన్యాన్ని సీఎం చంద్రబాబు అడ్డగోలుగా దోచేస్తున్నాడని.. ప్రభుత్వ ఖజానాకు పాడేరు నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని.. ఇలా చేస్తే కళింగాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని పవన్ హెచ్చరించారు..

కళింగాంధ్ర ఉద్యమం ప్రారంభమైతే బాబుతో సహా టీడీపీ నాయకులు ఎవ్వరికీ సుఖశాంతులు ఉండవని పవన్ హెచ్చరించారు. తెలంగాణ వలె కళింగాంధ్ర ఉద్యమం కూడా ఉవ్వెత్తున సాగుతుందని స్పష్టం చేశారు. పవన్ మాట్లాడుతుండగా.. అభిమానులు - జనసేన కార్యకర్తలు పదే పదే సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనికి వారిని ఏమీ అనని పవన్ నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషంగా చెప్పవచ్చు.

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని.. కానీ వస్తున్నాయా అని పవన్ స్థానిక యువతను ప్రశ్నించారు. తాను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రి - వంద పడకల గురించి మాట్లాడడానికేన్నారు. ఇక్కడ ఆస్పత్రి ఉన్నా కావాల్సిన డాక్టర్లు - సిబ్బంది - అంబులెన్సులు లేవన్నారు. సీఎంకు పాడేరు నుంచి చెబుతున్నానని.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నారని.. కానీ బబ్బుల ఏపీని చేశారని పవన్ మండిపడ్డారు. దేశంలో ఎక్కువమంది డాక్టర్ గ్రాడ్యూయేట్లు ఏపీ నుంచే ఉంటారని.. కానీ ఇక్కడి ఆస్పత్రుల్లో ఉండరన్నారు. మొన్న నేను ఇక్కడ ఓ చిన్నారిని ఎత్తుకున్నానని.. నా కొడుకు అంత వయసు ఉన్నా ఆమె ఏదో విచిత్ర వ్యాధితో బాధపడుతోందన్నారు. ఇక్కడ ఇంతమంది వ్యాధులతో చస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

హెరిటేజ్ పరిశ్రమ ఉండగా.. రాజకీయాల్లో ఇంకా డబ్బులు అవసరమా అని చంద్రబాబు - లోకేష్ అంటున్నారని.. అసలు మీకు వేతనాలు కూడా అవసరం లేదని పవన్ సెటైర్ వేశారు. వేతనాలు తీసుకోకుండా పనిచేయాలని సూచించారు. టీడీపీ నాయకులు నీళ్లు లేని చోట బాత్రూం కట్టించారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అవసరం లేదన్నా చంద్రబాబు ఇప్పుడు చిత్త శుద్ది లేని దీక్షలపై రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ మండిపడ్డాడు. ఇలా దీక్షలపై పెట్టే రూ.కోటి పాడేరు ఆసుపత్రికి ఇస్తే బాగుంటుందని పవన్ సూచించారు.