Begin typing your search above and press return to search.

అటు మీటింగులూ..ఇటు షూటింగులూ..అదిరిందయ్యా ప్లాన్ !

By:  Tupaki Desk   |   13 Jun 2023 3:00 PM GMT
అటు మీటింగులూ..ఇటు షూటింగులూ..అదిరిందయ్యా ప్లాన్ !
X
సినీ నటుడు కం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ముందస్తు ఎన్నికలు జరగవచ్చు అని ముందస్తు జాగ్రత్తతోనే వారాహి వాహనాన్ని షెడ్డు నుంచి రోడ్డు మీదకు దించారు. అయితే ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని జగన్ తేల్చేశారు. దాంతో ఇపుడు ఏకధాటీగా కాకుండా దశల వారీగా వారాహీ రధయాత్ర ఏపీలో సాగనుంది.

పవన్ అయితే దాదాపుగా ఏపీకి షిఫ్ట్ అయినట్లే. అంటే ఎన్నికలు ముందస్తు అయిన షెడ్యూల్ ప్రకారం అయినా ఆయన మకాం మంగళగిరిలోనే అని అంటున్నారు. ఈ విషయాన్ని తెలంగాణా జనసేన ప్రతినిధులతో పవన్ చెప్పేశారు కూడా. ఇక మీదట అన్నీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పవన్ వారాహి రధయాత్ర సన్నాహాలు ఒక వైపు సాగుతూంటే పవన్ తో వరస సినిమాలు కమిట్ అయిన నిర్మాతలు డైరెక్టర్లు కూడా మంగళగిరికి తరలి రావడం విశేషం.

వారంతా జనసేన పార్టీ మీటింగులకు కాదు తన సినిమా షూటింగులకు అని అంటున్నరు. డైరెక్టర్ హరీష్ శంకర్ లాంటి వారు అయితే పవన్ ఎటూ మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి తన సినిమా షూటింగులు అన్నీ ఇక మీదట గుంటూరు, విజయవాడల మధ్య చేసుకుంటామని చెప్పేశారు. అంటే మీటింగులకు విరామం ఇచ్చిన మధ్యలో షూటింగులు ఉంటాయన్న మాట.

అలా మీటింగులు షూటింగులు ఒక దాని తరువాత ఒకటి జరుగుతూ ఉంటాయన్న మాట. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన వేళ పవన్ ఏపీని వీడకూడదు అనుకుంటున్నారు. జగన్ ముందస్తు ఎన్నికలు లేవు అని చెప్పినా పవన్ లోనూ టీడీపీలోనూ ఎక్కడో డౌట్ అయితే ఉంది. అందుకే మంగళగిరి నుంచే పొలిటికల్ యాక్టివిటీని మొదలెట్టి ఏపీలోనే ఉంటూ ఏపీ వాసిగా అనిపించుకోవాలని చూస్తున్నారు.

అదే టైం లో సినిమా షూటింగులకు కూడా ఇబ్బంది లేకుండా తాను ఉన్న చోటనే వాటినీ కానిచ్చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో షూటింగులు జరగాలి అని జగన్ సర్కార్ చాలా కాలంగా కోరుతోంది. ఆ మధ్యన దాకా రాజమండ్రీ తదితర ప్రాంతాలలో షూటింగులు జరిగేవి. ఇపుడు పెద్ద హీరోల షూటింగులు అయితే లేవు.

పవన్ కళ్యాణ్ వారాహి రధ యాత్ర పుణ్యమాని షూటింగులు ఏపీలో ముమ్మరంగా జరగబోతున్నాయని అంటున్నారు. పైగా మంగళగిరి పరిసరాలు షూటింగులకు అనుకూలం అని హరీష్ శంకర్ అంటున్నారు. మొత్తానికి పవన్ తో సినిమాలు తీసే వారంతా ఈ ఏడెనిమిది నెలలలో షూటింగులను గుంటూరు పరిసర ప్రాంతాలలో చేసుకుంటారని అంటున్నారు. క్రిష్ణమ్మ తీరాన షూటింగులు జరగడం అంటే ఆందందకరమే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీటింగులు కూడా మధ్యలో ఉంటాయి. ఇదన్న మాట ప్లాన్.