Begin typing your search above and press return to search.

తోక పార్టీగానే ఉంటామంటున్న పవన్

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:40 PM GMT
తోక పార్టీగానే ఉంటామంటున్న పవన్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అందరినీ నిరాశపరిచారు. రాజకీయాల్లోకి వచ్చిన తమ అభిమాన నటుడు ఏదో ఉద్దరిస్తాడని ఆశలుపెట్టుకుంటున్న కోట్లాది మంది అభిమానుల ఆశలపై ఆయన కుండలతో నీళ్లు కుమ్మరించేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతివ్వడం వరకే పరిమితమైన ఆయన ఈసారి పార్టీ పెట్టడంతో భారీ స్థాయిలో ఎన్నికల గోదాలోకి దిగుతారని అంతా ఆశపెట్టుకున్నారు. ఒకవేళ చంద్రబాబు పార్టీ టీడీపీతో మైత్రి పెట్టుకున్నా పార్టీని సొంతంగా బరిలో నిలుపుతారన్న ఆశతో అంతా ఉన్నారు. కానీ... పవన్ ఈ రోజు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయింది. ఈసారి కూడా తాను వేరే పార్టీకి మద్దతివ్వడం వరకే పరిమితమవుతానని ఆయన చెప్పకనే చెప్పారు.

తాను రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌లుకుతాన‌న్న ప్రశ్న అందరిలోనూ ఉందని... ఎవ‌రైతే రైతుల‌కు అండ‌గా ఉంటారో వారికి తాను మ‌ద్ద‌తిస్తానంటూ పవన్ స్పష్టతనిచ్చారు. అనంతపురంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... అనంత‌పురం రైతాంగం క‌న్నీరుని ఎవ‌రు తుడుస్తారో వారికి తాను అండ‌గా ఉంటానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా మ‌ద్ద‌తిచ్చే ముందు అనంత‌పురానికి అండ‌గా ఎలా నిల‌బ‌డతార‌ని అడుగుతానని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుందని, అనంత‌పురం నుంచి తనకు మద్దతు కావాలని కోరారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వచ్చి ఓటేయమని అడుగుతారని, అనంతపురానికి ఏం చేశారని నిలదీయాలని చెప్పారు.

కాగా పవన్ మాటలతో అభిమానులు అప్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతూ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, వారి మద్దతు తీసుకోవడం వేరు.. తానే ఇలా వేరొకరికి మద్దతిస్తానని చెప్పడం వేరంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రైతుల సమస్యలపై ఫోకస్ చేయడం మంచిదే అయినా, రాజకీయంగా ఇలా తోకపార్టీగా ఉంటానని చెప్పడమే బాగులేదని విమర్శిస్తున్నారు.