Begin typing your search above and press return to search.

పీకే లేకుండా జనసేన సమావేశాలు..ఇదే తొలిసారి!

By:  Tupaki Desk   |   1 March 2020 5:07 PM GMT
పీకే లేకుండా జనసేన సమావేశాలు..ఇదే తొలిసారి!
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ జనసేనకు సంబంధించి రేపటి నుంచి ఓ మూడు రోజుల పాటు కొత్త ఒరవడి కనిపించనుంది. పార్టీ అధినేత హోదాలో పవన్ కల్యాణ్... పార్టీకి సంబంధించిన ప్రతి సమావేశానికి అధ్యక్షత వహించారు. అసలు పవన్ లేకుండా ఆ పార్టీ సమావేశాలే జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ లేకుండా... పార్టీకి ఓ మోస్తరు పట్టు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయట. అది కూడా పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం ఉన్న విశాఖ జిల్లాతో పాటు మరో రెండు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమావేశాలు పవన్ లేకుండానే జరుగుతున్నాయట. మరి పవన్ లేకుండా జరుగుతున్న ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నదెవరో తెలుసా? ఇంకెవరు.. నిత్యం పవన్ వెన్నంటే నడుస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహరేనట.

వినడానికి కాస్త వింతగానే ఉన్నా.. పవన్ లేకుండా ఆ పార్టీ సమావేశాలు జరగడం ఆ పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి అన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా ఈ సమావేశాలకు హాజరు కాకుండా పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లారంటారా? పవన్ ఎక్కడికీ వెళ్లేలేదట. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలను పక్కనపెట్టిన పవన్... మొన్నటి ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగలగానే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సై అన్నారు కదా. అందులో భాగంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. సినిమా షూటింగుల కారణంగానే పవన్ ఉత్తరాంధ్ర పార్టీ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారట.

సరే మరి... పవన్ కల్యాణ్ లేకుండా జరుగుతున్న జనసేన సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతున్నయో చూద్దాం పదండి. సోమవారం శ్రీకాకుళం జిల్లా సమీక్ష అనంతరం, ఆ మరునాడు అంటే మంగళవారం ఉదయం విజయనగరం జిల్లా సమీక్ష, మధ్యాహ్నం విశాఖ రూరల్ జిల్లా సమీక్షలు జరుగుతాయట. ఆ తర్వాత బుధవారం విశాఖ అర్బన్ జిల్లా సమీక్ష జరుగుతుందట. ఈ మూడు జిల్లాల సమీక్షలు మూడు రోజుల పాటు జరగనుండగా... ఈ సమీక్షలన్నింటికీ పవన్ స్థానంలో నాదెండ్ల మనోహరే నేతృత్వం వహిస్తారట. స్వయంగా పవన్ వస్తేనే... ఆ సమావేశాలకు వచ్చే జనాలే తక్కువగా కనిపిస్తుంటే... ఇప్పుడు పవన్ లేకుండా జరుగుతున్న సమావేశాలకు ఇంకెంత మంది హాజరవుతారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.