Begin typing your search above and press return to search.

పీకే సారూ..అంతా అయిపోయాక కార్యాచరణ ఏమిటండీ?

By:  Tupaki Desk   |   27 Dec 2019 1:30 AM GMT
పీకే సారూ..అంతా అయిపోయాక కార్యాచరణ ఏమిటండీ?
X
ఏపీలో ఇప్పుడు రాజధాని విషయం పై పెద్ద దుమారమే రేగింది. చంద్రబాబు సర్కారు రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ వరకే పరిమితం చేస్తూ... విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ - కర్నూల్ లో జ్యూడిషియల్ కేపిటల్ దిశగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు చాలా స్పీడుగానే అడుగులు వేస్తోంది. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు... జగన్ నిర్ణయంపై భగ్గుమన్నారు. ఇప్పటికే తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం అమరావతి పరిధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇంత జరుగుతున్నా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం జగన్ రాజధాని నిర్ణయంపై తన స్టాండేమిటో స్పష్టం చేయలేదు. మూడు రాజధానులంటూ జగన్ చేసిన ప్రకటనపై శుక్రవారం జరగనున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జగన్ నిర్ణయమేమిటో స్పష్టమైన తర్వాతే తాను తన స్టాండ్ ను వెల్లడిస్తానని పవన్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం జగన్ తన కేబినెట్ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భేటీలో రాజధానిపై జగన్ తేల్చేయడం ఖాయమే. అంతేకాకుండా కేబినెట్ భేటీ తర్వాత విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై జగన్ సర్కారు చాలా వేగంగానే చర్యలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కేబినెట్ భేటీ ముగిసిన మరునాడే జగన్ నేరుగా విశాఖ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖకు కీలకమైన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను కేటాయించేసిన జగన్ కు మరిచిపోలేని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి రాజధానిపై జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం - ఆ వెంటనే విశాఖలో జగన్ భారీ పర్యటన జరిగిన తర్వాత రెండు రోజులకు పవన్ తన స్టాండేమిటో ప్రకటించడం వల్ల లాభమేమిటో అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాజధానిపై జగన్ సర్కారు తీసుకునే నిర్ణయంపై తాను ఎలా ముందుకు సాగాలన్న విషయంపై తేల్చేందుకు పవన్ ఈ నె 30న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తారట. ఈ భేటీకి పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీలతో పాటు పార్టీ వ్యూహాత్మక కమిటీ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన కీలక నేతలు హాజరవుతారట. వారందరితో చర్చించడంతో పాటుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయి... ఆయా ప్రాంతాల్లో రాజధానిపై జగన్ సర్కారు నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న వివరాలు పవన్ సేకరిస్తారట. ఆ తర్వాతే... రాజధానిపై పార్టీ స్టాండేమిటన్న విషయాన్ని వెల్లడిస్తామని జనసేన ప్రకటించింది. రాజధానిపై ఇప్పటికే ఓ ప్రకటన చేసిన జగన్... శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుని, ఆ వెంటనే విశాఖ పర్యటనకు వెళ్లిపోవడం, వెనువెంటనే అక్కడ రాజధాని పనులు కూడా ప్రారంభమైపోతాయి. ఈ క్రమంలో అంతా అయిపోయాక పవన్ రాజధానిపై తన స్టాండేమిటన్నది వెల్లడించి ఏం లాభమన్న వాదన వినిపిస్తోంది.