Begin typing your search above and press return to search.

పవన్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనతో కేసీఆర్ కు షాకులు

By:  Tupaki Desk   |   19 May 2022 1:30 PM GMT
పవన్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనతో కేసీఆర్ కు షాకులు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమిటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించటం ఏమిటి? మరో రోజులో (మే 20న)ఆయన జరిపే ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల మీదనే ఫోకస్ చేసిన పవన్ కల్యాణ్.. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ తో కేసీఆర్ ను పోల్చి చూడటం మొదలైంది.

తెలంగాణ ప్రజల కోసం వారి కష్టాలు తీర్చటం కోసం ఉద్యమ నేతగా ప్రయాణం మొదలెట్టి.. ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. ఏ రోజు పార్టీ నేతలు (ముఖ్య నేతలు మినహాయిస్తే) ఎవరైనా మరణిస్తే వారికి నివాళులు అర్పించటానికి కూడా వెళ్లని పరిస్థితి. అలాంటిది ఇక కార్యకర్తల కోసం ప్రగతి భవన్ కానీ.. ఫాం హౌస్ కానీ వదిలి వారి ఇంటికి వెళ్లే ఛాన్సే లేదు. సొంత పార్టీ కోసం పని చేస్తున్న వారి విషయంలో కేసీఆర్ తీరు ఇలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు అందుకు భిన్నమని చెప్పాలి.

తెలంగాణలో ఆయన పార్టీ ప్రభావం ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ పార్టీ కార్యకర్త ఒకరు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో.. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ స్వయంగా వెళుతున్న వైనం చూసిన వారికి.. మాటలు చెప్పే తండ్రీకొడుకులు (కేసీఆర్.. కేటీఆర్ లు) చప్పున గుర్తుకు వచ్చే పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్.. కోదాడ ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాల్ని పరామర్శించటమే కాదు.. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కుల్ని అందజేయనున్నారు.

ఇందులో భాగంగా 20న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోబయలుదేరే పవన్ కల్యాణ్.. మొట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా.. ఎల్బీనగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామానికి వెళ్లి.. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత కోదాడ వెళ్లి కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి.. చెక్కును అందజేయనున్నారు. తెలంగాణలో పార్టీ ఉనికే లేని జనసేన అధినేత తన పార్టీ కోసం పని చేసే వారి విషయంలో ఇంతలా తపిస్తుంటే.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించే గులాబీ సైనికుల విషయంలో కేసీఆర్.. కేటీఆర్ తీరు ఇప్పుడు చర్చకు తెర తీసేలా మారిందని చెప్పాలి.