Begin typing your search above and press return to search.

ల‌క్నో కు వెళ్లి మ‌రీ ప‌రువు తీసుకున్న ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:17 AM GMT
ల‌క్నో కు వెళ్లి మ‌రీ ప‌రువు తీసుకున్న ప‌వ‌న్‌?
X
రాజ‌కీయం అంటే సినిమాల్లో న‌టించ‌ట‌మంత సులువు కాదు. కొన్ని వంద‌ల మంది క‌ష్టాన్ని తెర మీద త‌న‌ది చూపించి.. హీరోయిజం ప్ర‌ద‌ర్శించే రీల్ హీరో.. రియ‌ల్ హీరో కావాలంటే చాలానే అంశాలు ఉండాలి. ఆ చేదు నిజం ప‌వ‌న్ కు ఇప్ప‌టికైనా అర్థ‌మ‌వుతుందో కాదో? ప‌వ‌న్ ఈల వేస్తే ల‌క్ష‌ల‌ మంది రియాక్ట్ అవుతారు. ప‌వ‌న్ వ‌స్తున్నారంటే వేలాది మంది విర‌గ‌బ‌డ‌తారు. అదంతా ఎక్క‌డ‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ద‌క్షిణాదిలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో. కానీ.. ప‌వ‌న్ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఉత్త‌రాదిలో ఆయ‌న‌కున్న ఇమేజ్ ఎంత‌? అన్న విష‌యం తాజాగా తాను చేసిన ల‌క్నో యాత్ర పుణ్య‌మా అని అర్థ‌మైపోతుంద‌న్న మాట వినిపిస్తోంది.

జాతీయ రాజ‌కీయాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని క‌లిసేందుకు తాను యూపీ రాజ‌ధాని ల‌క్నోకు వెళుతున్న‌ట్లుగా ప‌వ‌న్ కాసింత హ‌డావుడి చేయ‌టం తెలిసిందే. ప‌వ‌న్‌తో పాటు ఈ మ‌ధ్య‌న ఆయ‌న పార్టీలో చేరిన మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తో పాటు మ‌రికొంద‌రు నేత‌ల ప‌రివారం ల‌క్నో టూర్ కు వెళ్లారు.

ఇంత హ‌డావుడి చేసి ల‌క్నోకు వెళ్లిన ప‌వ‌న్ ను క‌లిసేందుకు మాయావ‌తి సుతారం ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. ఆమె నుంచి ముంద‌స్తు అపాయింట్ మెంట్ తీసుకోక‌పోవ‌టం కార‌ణంగా చెబుతున్నారు. అయినా.. ప‌వ‌న్ లాంటోడు ఒక జాతీయ స్థాయి నాయ‌కురాలిని క‌లిసేందుకు వెళ్లేట‌ప్పుడు అపాయింట్ మెంట్ తీసుకోకుండా వెళ‌తారా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

ఒక‌వేళ ముంద‌స్తు అపాయింట్ మెంట్ తీసుకొని ఉంటే.. అది ర‌ద్దు అయిన విష‌యాన్ని ప‌వ‌న్ చెప్పాలి. కానీ.. అదేమీ చెప్ప‌లేద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌వేళ మాయ‌వ‌తికి కుద‌ర‌కపోతే.. ఆ పార్టీలో నెంబ‌ర్ టూ లేదంటే కాస్త పేరున్న నేత‌తో అయినా భేటీ కావాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా పార్టీ సెక్ర‌ట‌రీతో మాట్లాడించిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే.

హ‌డావుడి చేసి విమానం ఎక్కిన ప‌వ‌న్ బ్యాచ్ రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని క‌లువ‌లేదు స‌రికాదా.. అంబేడ్క‌ర్ పార్కులో రెండు గంట‌ల పాటు గ‌డ‌ప‌టం చూస్తే.. ప‌వ‌న్ అండ్ కో ప్లానింగ్ కు చేతులెత్తి మొక్కాల‌నిపించ‌క మాన‌దు. అస‌లు ల‌క్నో ప‌ర్య‌ట‌నే మాయ‌వ‌తిని క‌ల‌వ‌టం కోస‌మే అయితే.. ఆమెను ఎందుకు క‌ల‌వ‌లేద‌న్నది ఇప్పుడు ఆస‌క్త‌క‌ర అంశంగా మారింది. ప‌వ‌న్ అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలుసు కానీ.. జాతీయ స్థాయి నాయ‌కుల‌కు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు తెలీద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ లాంటోడు తెలుసుకుంటే ఇలాంటి అనుభ‌వాలు ఎదురుకావంటున్నారు. ఏమైనా.. ల‌క్నో ట్రిప్ మీద ప‌వ‌న్ కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.