Begin typing your search above and press return to search.

జ‌న‌సేన వీర మ‌హిళ ప్రారంభం!

By:  Tupaki Desk   |   22 Jan 2018 7:43 AM GMT
జ‌న‌సేన వీర మ‌హిళ ప్రారంభం!
X
అప్ప‌టివ‌ర‌కూ మౌనం.. అంత‌లోనే హ‌డావుడి.. ఆపై మ‌ళ్లీ అదృశ్యం అన్న‌ట్లుగా ఉంటుంది జ‌న‌సేన తీరు చూస్తే. క్రియాశీల రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటాన‌ని చెప్పిన షెడ్యూల్‌కు నాలుగైదు నెల‌లు దాటినా.. ప్ర‌జ‌ల్లోకి రాని ప‌వ‌న్‌.. ఆక‌స్మికంగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. రెండు రోజుల క్రితం త‌న తెలంగాణ టూర్ గురించి ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్ల‌ను ప‌క్కాగా చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం కార్య‌క్ర‌మాల్ని వ్యూహాత్మ‌కంగా ఆచ‌ర‌ణ‌లోకి తీసుకొస్తున్న జ‌న‌సేన‌.. అందుకు సంబంధించిన వివ‌రాలు ముందుగా మాత్రం బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నాల‌కు అంద‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌లో పార్టీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న మీడియా త‌మ‌కు అనుకూలంగా లేన‌ట్లుగా పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే.. వీలైనంత వ‌ర‌కూ గుట్టుగా కార్య‌క్ర‌మాల రూపక‌ల్ప‌న చేసి.. వాటిని అనూహ్యంగా తెర మీద‌కు తీసుకొస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

మెరుపుదాడి మాదిరి.. మెరుపు టూర్ల‌తో ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌గా పార్టీ మారాల‌ని భావిస్తున్నారు. తాజాగా చేప‌డుతున్న తెలంగాణ టూర్ ప్లాన్ ను రెండు నెల‌ల ముందే సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఈ విష‌యాల‌పై అన‌వ‌స‌ర‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఉండ‌టం కోస‌మే బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చెబుతారు.

సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీలు తమ ఫ్యూచ‌ర్ కార్య‌క్ర‌మాల మీద ముందే ప్ర‌క‌టిస్తుంటాయి. దీనికి భిన్నంగా జ‌న‌సేన వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెప్పాలి. తెలంగాణ టూర్ తో పాటు పార్టీ మ‌హిళా విభాగ‌మైన వీర మ‌హిళ విభాగాన్ని స్టార్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం. మ‌హిళా విభాగం ప్రారంభంలో భాగంగానే స‌తీమ‌ణి అన్నాను తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌పై వీర మ‌హిళ పేరుతో సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం మొద‌లు పెట్ట‌నున్న‌ట్లుగా పార్టీ చెబుతోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన వివిధ విభాగాల‌కు ఆస‌క్తిక‌ర పేర్లు పెట్టే ప‌వ‌న్‌.. మ‌హిళా విభాగానికి పెట్టిన పేరు ఆక‌ట్టుకునేలా ఉండ‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉంది.