Begin typing your search above and press return to search.

మార్చి 14.. పవన్ ఫ్యాన్స్ మరిచిపోలేదు

By:  Tupaki Desk   |   22 Feb 2016 9:23 AM GMT
మార్చి 14.. పవన్ ఫ్యాన్స్ మరిచిపోలేదు
X
మార్చి 14.. రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన తేదీ ఇది. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినీ నటుడు మాత్రమే. కానీ ఆ రోజు అతను రాజకీయ నాయకుడి అవతారం కూడా ఎత్తాడు. ‘జనసేన’ పేరుతో పార్టీని అనౌన్స్ చేసి సంచలనం రేపాడు. ఐతే ఆ రోజు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లు మాత్రం జనసేన పార్టీ రూపు దిద్దుకోలేదు. ఇప్పటిదాకా అసలు పార్టీ నిర్మాణమే జరగలేదు. పవన్ పార్టీ నుంచి ఎవ్వరూ ఎన్నికల్లో పోటీ పడనూ లేదు. అప్పుడప్పుడు బ్యాగ్రౌండ్ లో జనసేన గుర్తు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడ్డం మినహాయిస్తే పార్టీ పరంగా ఏ కార్యక్రమమూ చేయలేదు పవన్.

దీంతో ‘జనసేన’ ఉనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీ లైమ్ లైట్ లోకి వస్తుందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం ‘జన సేన’ గురించి పవన్ కూడా పట్టించుకునే స్థితిలో లేడు. ఐతే పవన్ అభిమానులు మాత్రం ‘జన సేన’ను మరిచిపోలేదు. ఇటీవలే 300 మంది పవన్ అభిమానులు జనసేన కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య.. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పరిణామాలపై చర్చ జరిపారు. అంతే కాదు.. మార్చి 14న జనసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఆ రోజు జనసేన పార్టీని వార్తల్లో నిలబెట్టాలని నిశ్చయించుకున్నారు. మొత్తానికి పవన్ పట్టించుకోకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం ‘జనసేన’పై ఓ కన్నేసే ఉంచారన్నమాట.