Begin typing your search above and press return to search.

మ‌ద్ద‌తిచ్చాను కాబ‌ట్టే చొక్కా ప‌ట్టుకుని లాగుతా

By:  Tupaki Desk   |   27 Jun 2018 3:25 PM GMT
మ‌ద్ద‌తిచ్చాను కాబ‌ట్టే చొక్కా ప‌ట్టుకుని లాగుతా
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలో జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జా క్షేత్రంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ తాజాగా ఓ కీల‌క స‌మావేవం ఏర్పాటు చేశారు. అయితే ఈ సంద‌ర్భంగా అటు కేంద్ర ప్ర‌భుత్వం ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వంను ప్ర‌స్తావించ‌డ‌మే కాకుండా...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను త్వ‌ర‌లో క‌ల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో 'జనస్వరం' పేరిట చర్చా కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మేధావులు తమ ఆలోచనలు - సూచనలు - అభిప్రాయాలు అందించిన అనంతరం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు.

ఎటు చూసినా పచ్చటి భూములు... జల వనరులు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సహజ వనరులు - గనులపై కొందరి దృష్టిపడిందనీ - వీటిని దోచే పని మొదలైందని చెప్పారు. ఆ పథకంలో భాగంగానే ఇక్కడ బతకలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు అన్నారు. ఈ విషయాలు చూసే మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. వీరి కోపానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తార‌ని టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తే ఉత్త‌రాంధ్రలో ల‌క్ష ఎక‌రాల‌ను క‌బ్జా చేశారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు. `` టీడీపీ వాళ్ళు దోపిడి చేయ‌డానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు - త‌ప్పు చేస్తే చొక్కా పట్టుకుని లాగుతా... ప్ర‌జాక్షేత్రంలో నిల‌దీస్తా. 2019లో అధికారంలోకి వ‌స్తే ఉత్త‌రాంధ్ర నుంచి వ‌ల‌స వెళ్లిన కూలీల‌కు ఇక్క‌డే హెక్టార్ భూమి పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాను. అవసరమైతే భూమి కొనుగోలు చేసి ఇస్తాం. వ‌ల‌స రాజ‌కీయ నేత‌ల‌కు కాకుండా స్థానిక నాయ‌కుల‌కే టిక్కెట్ ఇస్తాను`` అని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే... త్వ‌ర‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌ల‌వ‌నున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. ``తెలంగాణ‌లో బీసీ జాబితా నుంచి తొల‌గించిన ఉత్త‌రాంధ్ర‌ కులాల‌ను మ‌ళ్లీ బీసీల్లో చేర్చేలా మేధావుల‌తో క‌లిసి తెలంగాణ సీఎం కేసీఆర్ కు విన‌తి ప‌త్రం ఇస్తాను. ఇక్కడి ప్రకృతి వనరులు దెబ్బ తినకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం`` అని అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైద‌రాబాద్‌ లోని సెటిల‌ర్ల‌లో ఒక‌రైన ఉత్త‌రాంధ్ర‌లోని ప‌లు కులాల వారిని బీసీ జాబితా నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో గ‌తంలో ప‌లువురు వినతిప‌త్రం ఇచ్చిన‌ప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. కాగా, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు తొల‌గించిన బీసీ కులాల‌ను తిరిగి జాబితాలో చేర్చుతాన‌ని హామీ ఇవ్వ‌డంతోనే టీడీపీ త‌ర‌ఫున గెలిచిన తాను పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఆ కులాల‌ను బీసీ జాబితాలో చేర్చ‌లేదు. తాజాగా ప‌వ‌న్ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కేసీఆర్‌తో భేటీ అవుతాన‌ని హామీ ఇచ్చారు. మ‌రి ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జంపింగ్ ఎమ్మెల్యేకు ఇచ్చిన‌ హామీని గుర్తుచేస్తారా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.