Begin typing your search above and press return to search.

పర్చూరు పదనిసలు : టీడీపీ కోటలో పవన్ చేసిందేంటి..?

By:  Tupaki Desk   |   20 Jun 2022 2:30 AM GMT
పర్చూరు పదనిసలు  : టీడీపీ కోటలో పవన్ చేసిందేంటి..?
X
ప్రకాశం జిల్లాలో పర్చూరుకు ఒక ఘనమైన రాజకీయ  చరిత్ర ఉంది. తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి ఎక్కువ సార్లు అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఇక్కడ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గట్టి పట్టుంది. ఆయన 1983లో తన మామ ఎన్టీయార్ పార్టీ పెడితే ఫస్ట్ టైం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఆ తరువాత 1985, 1989లో సైతం గెలిచారు. 1991లో మాత్రం ఆయన బాపట్ల నుంచి పార్లమెంట్ కి ఎంపీగా వెళ్ళారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి 2004, 2009 లో కూడా పర్చూరు నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడారు.

ఇక చంద్రబాబు జమానాలోకి టీడీపీ ఏలుబడిలో కూడా అంతే స్ట్రాంగ్ గా పార్టీ ఉంది. గత పాతికేళ్ళలో మూడు సార్లు టీడీపీ గెలిచింది అక్కడ. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పవర్ ఫుల్ లీడర్. ఇక 2019 తరువాత వైసీపీకి అక్కడ సరైన నాయకత్వం లేదు. లేటెస్ట్ గా అక్కడికి ఎవరినైనా షిఫ్ట్ చేసి టికెట్ ఇవ్వాలని చూస్తోంది ఆ పార్టీ.

అలాంటి పర్చూరు లాంటి టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న చోట పవన్ తాజాగా  జనసేన సభ పెట్టారు. ఇక్కడ పేరుకే అధికార పార్టీ మీద సవాల్ చేసినా అసలు విషయం ఏంటి అంటే టీడీపీకి తన సత్తా ఏంటో చాటి చెప్పాలనే ఆరాటమే అని అంటున్నారు. మహానాడు తరువాత టీడీపీ టోన్ పూర్తిగా మారిపోయింది. అలాంటి టైమ్ లో పవన్ టీడీపీకి పట్టున్న చోట అందునా అదే ఒంగోలు జిల్లాను ఎంచుకుని జస్ట్ శాంపిల్ అన్నట్లుగా ఒక మీటింగ్ పెట్టారు.

ఆ మీటింగునకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఒక విధంగా పవన్ సభకు వచ్చిన జనాలను వేటితోనూ పోల్చడానికి వీలు లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జన సందోహమే అని చెప్పాలి. మరి పవన్ ఈ సభలో టీడీపీని డైరెక్ట్ గా ఒక్క మాట అనలేదు కానీ గుచ్చాల్సినవి గుచ్చేశారు అంటున్నారు. తనకు జనంతో తప్ప ఎవరితో పొత్తులు లేవని పవన్ చాటి చెప్పారు. అంటే ఒక విధంగా నా నుంచి ఇక మీదట పిలుపులూ వలపులూ పొత్తుల పేరిట వేరేగా  ఉండవని తెగేసి చెప్పారన్న మాట.

అదే టైమ్ లో మీకు కంచు కోట లాంటి చోట నా జన విశ్వరూపం చూడండి అని ఒక బలమైన  సంకేతాన్ని పంపారు. ఇలా పవన్ ఏరి కోరి మరి ఎంచుకున్న పర్చూరు జనసేనకు పరవశాన్నే తెచ్చింది. నిజానికి ఆ ప్రాంతంలో జనసేనకు పెద్దగా పట్టు లేదంటారు. కానీ వచ్చిన జనాలను చూస్తే మాత్రం జనసేన నిలబడితే భారీగానే  మద్దతు దక్కుతుంది అనే చెప్పేలా ఉంది. మరి పవన్ మార్క్ వ్యూహం అన్నది అదిరింది అనే చెప్పాలి.