Begin typing your search above and press return to search.

నాలుగవ ఆప్షన్ : ఒక్క చాన్స్ అంటున్న పవన్... ?

By:  Tupaki Desk   |   20 Jun 2022 2:30 AM GMT
నాలుగవ ఆప్షన్ : ఒక్క చాన్స్ అంటున్న పవన్... ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్  హఠాత్తుగా నాలుగ ఆప్షన్ ని బయటకు తీశారు. ఆయన ఈ మధ్య కాలం దాకా మాట్లాడింది ఒక ఎత్తు. పొత్తుల మీద ఆయన తరచూ చేసిన ప్రకటనలు ఒక ఎత్తు. అలాగే ఆయన ఈ మధ్య పార్టీ ఆఫీసులో చెప్పిన మూడు ఆప్షన్లను పక్కన పెట్టేసినట్లుగానే ఉన్నారు. ఇపుడు ఆయన నాలుగవ ఆప్షన్ వైపుగా చూస్తున్నారు. అది ఆయన ఇప్పటిదాకా చెప్పని మాట. గుప్పిట విప్పకుండా ఉంచిన రహస్యం కూడా.

ఆయన ప్రకాశం జిల్లా టూర్ లో మాత్రం ఒక క్లారిటీతోనే మాట్లాడారు అనిపిస్తోంది. పొత్తులు నాకు జనంతోనే అని పవన్  పక్కా క్లారిటీతోనే అన్నారు. మేము ప్రజల కోసమే ఉంటాం, మేము వారికే బద్ధులమని కూడా ఆయన గట్టిగా చెప్పుకున్నారు. ప్రజలను పైకి తీసుకురావడానికి వారిని అందలాలు ఎక్కించడానికే జనసేన పుట్టింది అని కూడా పవన్ అన్నారు.

మొత్తానికి పవన్ జనసేన వైపు చూడండి  అని బిగ్ అప్పీల్ నే ఏపీ  జనాలకు చేశారు. ఇంతకాలం అందరికీ అవకాశాలు ఇచ్చారు. ఇపుడు మాకు ఇవ్వండి అని ఓపెన్ గానే అడిగేశారు. మీరు అన్నీ ఆలోచించుకునే మాకు మద్దతు ఇవ్వండి, మేము బాగా పాలించగలమని హామీ ఇస్తున్నామని కూడా చెప్పుకున్నారు.

జనసేనకు అవినీతి అక్కరలేదు, అక్రమాలు చేసే పరిస్థితి అంతకంటే లేదు. జనసేన నిజాయతీగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా గట్టిగా నిలబడగలితే దమ్మూ ధైర్యం ఉన్న పార్టీ. సామాన్యుల పార్టీ అని ఆయన చెప్పారు. మేము ఓడినా జనంలోనే ఉన్నామని కూడా గుర్తు చేశారు. నిజానికి 2014లోనే పోటీ చేసి మేము పవర్ లోకి వస్తే ఏపీకి ఇన్ని కష్టాలు ఉండేవి కావు అని పవన్ అంటున్నారు.

దాని అర్ధం బాబు ఏలుబడిలోనూ సమస్యలు ఉన్నాయని పవన్  చెప్పకనే చెప్పడమే కదా అంటున్నారు. అలాగే ప్రజల కొరకే బాబుని నిగ్గదీశామని కూడా ఆయన చెప్పుకున్నారు.  బీజేపీని ప్రత్యేక హొదా విషయాన గట్టిగా అడిగామని ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మిత్రులు అని చెప్పుకునే ఆ రెండు పార్టీలతో ఆనాడే  విభేధించినట్లుగా పవన్ ఇన్నేళ్ళ తరువాత జనాలకు మరో మారు గుర్తు చేయడంలో ఆంతర్యం ఏమిటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

ఇక 2024లో  ప్రజలు తనను నమ్మి  అవకాశం తమకు ఇస్తే బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పవన్ చెప్పారు. మొత్తానికి పవన్ మాటలను బట్టి చూస్తే పంతం మీదనే ఉన్నారు అనుకోవాలి. ఆయన పొత్తుల మీద ఈ మధ్య మాట్లాడినా మనసు విప్పి చెప్పినా టీడీపీ సైలెంట్ కావడం, అంతే కాకుండా పవర్ షేరింగ్ విషయంలో తమ్ముళ్ళు ఎగతాళీ చేయడం వంటివి చూసిన తరువాతనే ఆయన వైఖరిలో గణనీయమైన మార్పు  వచ్చింది అంటున్నారు.

మరి పవన్ మాటలను చూస్తే కనుక విజయమో వీర స్వర్గంలో జనంతోనే తేల్చుకుందామనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఒక్క చాన్స్ అని పవన్ అడిగితే జగన్ కి రెండో చాన్స్ ఉంటుందా. బాబుకు సీఎం గా నాలుగవ చాన్స్ దక్కేనా ఇవన్నీ ప్రశ్నలే. తెలివైన ఏపీ జనాలు తీర్పు కూడా చాలా విజ్ఞతతో కూడుకుని ఉంటుంది. అందువల్ల పవన్ ఒక్క చాన్స్ ని వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి. ఏది ఏమైనా జనాలకు పవన్ ఇపుడు మూడు ఆప్షన్లు ఇచ్చినట్లుగా ఉంది. తననో జగన్నో బాబునో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలని ఆయన ఈ మూడు ఆప్షన్లు వారి చేతుల్లోనే పెట్టినట్లుగా ఉంది మరి.