Begin typing your search above and press return to search.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం: పవన్‌ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   5 April 2023 10:11 AM GMT
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం: పవన్‌ హాట్‌ కామెంట్స్‌!
X
జనసేనా ని పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల ఢిల్లీ టూరు ముగిసింది. జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ తో కలసి ఢిల్లీ వచ్చిన ఆయన బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌ జీ తదితరులతో సమావేశమయ్యారు. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు ఏప్రిల్‌ 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డాతో కీలక అంశాల పై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలనేదే జనసేన, బీజేపీ ఎజెండా అని స్పష్టం చేశారు. వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనేదే తమ రెండు పార్టీల అభిమతమని తేల్చిచెప్పారు. త్వరలోనే వైసీపీ పాలన నుంచి ఏపీకి విముక్తి కలగాలని కోరుకుంటున్నానన్నారు.

వైసీపీ పాలన నుంచి ఏపీని ఎలా విముక్తి చేయాలో బీజేపీ నేతలతో చర్చించానని పవన్‌ తెలిపారు. ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ జనసేన లక్ష్యమని మరోసారి పవన్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా జనసేన, బీజేపీ ముందుకు వెళ్తాయన్నారు. భవిష్యత్‌ లో ఏపీకి మంచి రోజులు ఉంటాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మంచి ప్రణాళికతో బీజేపీ, జనసేన ముందుకెళ్లబోతున్నాయన్నారు.

జేపీ నడ్డాతో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పై చర్చించానని పవన్‌ వెల్లడించారు. ప్రధానంగా వైసీపీ పాలన నుంచి ఏపీని ఎలా విముక్తి చేయాలనే దానిపైనే ఇరు పార్టీలు చర్చలు జరిపామన్నారు. రాష్ట్ర భవిష్యత్, రాజకీయ ప్రణాళిక గురించి బీజేపీ నేతలతో చర్చించామని వివరించారు. అయితే పొత్తుల పై చర్చించలేదని...తాము అనుకున్న సమయానికి పొత్తుల పై స్పష్టత ఇస్తామని పవన్‌ తెలిపారు.

కాగా జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై పవన్‌ చర్చించారు. పాలన సంబంధిత అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను బీజేపీ పెద్దల దృష్టికి పవన్‌ తీసుకెళ్లారని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.