Begin typing your search above and press return to search.

జగన్ని ద్వేషించండి...మమ్మల్ని ప్రేమించండి...!

By:  Tupaki Desk   |   23 Jun 2023 4:00 PM GMT
జగన్ని ద్వేషించండి...మమ్మల్ని ప్రేమించండి...!
X
ప్రజాస్వామ్యం లో ఓటరు కు ఎవరి మీద ద్వేషం కానీ ప్రత్యేకమైన ప్రేమ కాని ఉండదు. ఇది మౌలికమైన అంశం. కానీ రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ద కాలం పై దాటినా జనసేన అధినేత పవన్ మాత్రం ఈ మూల సూత్రాన్ని విస్మరిస్తున్నారు. అంతే కాదు తాను తగిలించుకున్న కళ్ళద్దాల తోనే జనాల ను చూడమంటున్నారు. అక్కడే ఆయన రాజకీయం ఇబ్బంది పడుతోంది.

జగన్ని ద్వేషించాలి. ఇది పవన్ పది రోజుల వారాహి యాత్ర ఇచ్చిన సందేశం. ఈ నెల 14న పవన్ కత్తిపూడి నుంచి మొదలెట్టిన వారాహి యాత్ర పది రోజులు దాటింది. పవన్ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించారు. అవి కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడి వరం. ఇంకా రెండు పెండింగు లో ఉన్నాయి. అవి భీమవరం, నర్సాపురం. దీంతో తొలి దశ వారాహి యాత్ర పూర్తి అవుతుంది.

మరి పది రోజుల పాటు పవన్ చేసిన ప్రసంగాలు ఏమిటి. వారాహి యాత్ర తో ఏపీ రాజకీయ ముఖ చిత్రం టోటల్ గా మారిపోతుంది అని పవన్ సీఎం క్యాండిడేట్ అని జనాలు నమ్మేసి జనసేన గ్రాఫ్ ఏకంగా నలభై నుంచి నలభై శాతం పైదాటిపోతుందని పవన్ అభిమాని శ్రేయోభిలాషి అయిన మాజీ మంత్రి హరి రామజోగయ్య లాంటి వారు ఇప్పటికి కొన్ని నెలల క్రితం అంచనా కట్టారు. ఆ విధంగా జరుగుతోందా అసలు వారాహి యాత్రలో పవన్ ఇస్తున్న సందేశం ఏమిటి జనాల కు చేరుతున్నదేంటి అన్నది కనుక విశ్లేషించుకుంటే ఒక్కటి మాత్రం అర్ధం అవుతుంది.

అదే జగన్ని ద్వేషించండి, మమ్మల్ని ప్రేమించండి అంటే జనసేన ను అని, పొత్తులు ఉంటే టీడీపీ సహా కూటమి ని అని పవన్ భావన. అదే ఆయన చెబుతున్నారు. అది కూడా కొన్ని సార్లు క్లారిటీ గానే చెబుతున్నారు. మరి కొన్ని సార్లు అస్పష్టంగా చెబుతున్నారు. తాను సీఎం అని చెప్పినా లేక కూటమి తరఫున బాబు సీఎం అయినా ఏది అయినా పవన్ దృష్టి లో ఒక్కటే అవవచ్చు. ఆయన అజెండా పక్కా క్లియర్. అదేంటి అంటే జగన్ సీఎం కాకూడదు అంతే.

ఎందుకంటే ఏపీ కి జగన్ ప్రమాదకరం, వైసీపీ హాని కరం, జగన్ కనుక మరోమారు అధికారం లోకి వస్తే ఏపీ కి భవిష్యత్తు ఉండదు. నిజమే పవన్ ఆలోచనల మేరకు అలా చెప్పవచ్చు. అందులో తప్పు లేదు కూడా వైసీపీ ఏలుబడి బాలేకపోతే ఆయన వైసీపీ వద్దు అని చెప్పాలి. జనాల ను ఆ పార్టీకి ఓటు వేయవద్దు అని గట్టిగానూ చెప్పవచ్చు.

కానీ అలా చెప్పడం లో వారిని ఒప్పించగలగాలి. అసలు జగన్ని ఎందుకు ద్వేషించాలి. జనసేన లేదా కూటమి ని ఎందుకు ప్రేమించాలి. జగన్ అధికారం లో ఉంటే జరిగే నష్టం ఏమిటి, జనసేన లేదా కూటమి అధికారం లోకి వస్తే కలిగే లాభం ఏమిటి. ఇవన్నీ విడమరచి పవన్ చెప్పగలగాలి. కానీ పవన్ అసలు విషయం వదిలేసి ఆవేశంగా మాట్లాడుతూ కొన్ని సార్లు లోకల్ ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తూ ఇంకా తీవ్ర పదజాలంతో మాట్లాడుతూ పోతూ ఉంటే జనాల కు క్లారిటీ మిస్ అవుతోంది.

అంతే కాదు పవన్ అంటే జగన్ కి పక్కా వ్యతిరేకి అన్న ముద్ర పడ్డాక జగన్ ని దించేయాలని ఆయన పాలన వల్ల నష్టాలు కష్టాలు అని పవన్ ఎంత చెప్పినా జనాల కు ఎక్కుతుందా అన్నది డౌట్. తాను జగన్ కి వ్యతిరేకిని అని పదేళ్ళ క్రితం నుంచే పవన్ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు. నిజానికి 2014 నాటికి పవన్ ఫ్రెష్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆయన కు చంద్రబాబు అయినా జగన్ అయినా ఒక్కటే. అనుభవం ఉంది అన్న కారణంగా బాబు కు మద్దతు ఇచ్చినా జగన్ మీద అంత ద్వేషం వెళ్ళగక్కాల్సిన పని లేదు.

కానీ ఆయన అధికారంలో ఉన్న బాబు ని వదిలేసి నాడూ జగన్నే నిందించారు. కాబట్టే ఈ రోజు అధికారం లో జగన్ని నిజాయతీగా విమర్శలు చేస్తున్నా జనాల కు ఎక్కడంలేదు. ఇక వైసీపీకి దించేసి మమ్మల్ని గద్దెనెక్కించండి అని అంటున్నారు తప్ప ఆల్టర్నేషన్ ప్లాన్ ఏదీ జనం ముందు పెట్టలకపోతున్నారు.

దాంతో ఇది పవన్ సొంత సమస్యగా ఆయన బాధగానే మిగిలిపోతోంది. తన బాధ ను ప్రపంచ బాధగా చేయడమే రాజకీయ నాయకుడి ప్రధమ లక్షణం. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఆయన జగన్ని ఘాటుగా విమర్శలు చేస్తూ ఒక విధంగా తాను జగన్ ద్వేషిగా మారిపోయారు. ఇదే వైసీపీ కి అడ్వాంటేజ్ అవుతోంది.

ఈ రోజున టీడీపీ పరిస్థితి అంతే. రాజకీయాలు కాస్తా వ్యక్తిగతాలు కక్షలు కార్పణ్యాలు అయిపోతే జరిగేది ఇదే. మంచి ఏదో చెడ్డ ఏదో తెలిసే చాన్స్ ఉండదు. ఇపుడు ఏపీ లో విపక్షం జగన్ని వద్దు అని మాత్రమే అంటోంది. ఎందుకు వద్దో చెప్పిన నాడు మాత్రమే జనాలు నమ్ముతారు. జగన్ పది పనులు చేస్తే ఒక్కటి కూడా మంచిగా కనిపించకపోవడమే నిర్మాణాత్మక ప్రతిపక్షానికి మొదటి దెబ్బ.

నాలుగేళ్ల కాలం లో అలా మంచిని మంచిగా చెడు ని చెడు గా చెప్పకపోవడం వల్ల అంతా చెడునే చెబుతూండడం వల్లనే విపక్షాల వేదన ఎన్నికల వేళ కాస్తా నాయన పులి వచ్చే సామెత అవుతోందా అన్నది ఒక చర్చ. ఏది ఏమైనా ఓటరు ముందు ఎవరైనా అప్పీల్ మాత్రమే చేయగలరు. కన్విన్స్ కూడా చేస్తే తమ వైపు తిరుగుతారు. ఏపీలో విపక్షాల రాజకీయం చూస్తే అప్పీలు లేదు, కన్వీన్స్ చేసేది అంతకంటే లేదు, ఇలా జరిగితీరాలంతే అన్న వాదనే కనిపిస్తోంది. అక్కడే తేడా కొడుతోంది.