Begin typing your search above and press return to search.

బాబు ఆ ప‌ని చేస్తే..ఎదురు తిరగాల‌న్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   23 July 2018 5:27 AM GMT
బాబు ఆ ప‌ని చేస్తే..ఎదురు తిరగాల‌న్న ప‌వ‌న్‌
X
చెప్పిన మాట‌ను చెప్పిన‌ట్లుగా చేస్తే ఇబ్బందే ఉండదు. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు ఇందుకు భిన్నం. ఒక రోజు చెప్పిన మాట‌ను మ‌ళ్లీ యాదిలోకి రావాలంటే ఏడాది పైనే ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆగ్ర‌హంతో ఊగిపోయి మాట్లాడే ఆయ‌న‌.. త‌న నోటి నుంచి వ‌చ్చే మాట మీద నిల‌బ‌డ‌టంపై ఆయ‌న ఎప్పుడేం చేస్తారో అర్థం కాని ప‌రిస్థితి ఉంటుంది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం బాబు స‌ర్కార్ భూముల్ని సేక‌రించ‌టం తెలిసిందే. దీనిపై అమ‌రావ‌తికి సంబంధించిన కొంద‌రు రైతులు తమ భూముల్ని ఇచ్చేందుకు వ్య‌తిరేకించారు. దీనిపై ఇష్యూ అయిన‌ప్పుడు ఎంట‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్.. రైతుల‌కు వ్య‌తిరేకంగా.. వారికి ఇష్టం లేకుండా భూములు తీసుకునే అవ‌కాశ‌మే లేద‌ని.. ఒక‌వేళ అదే చేస్తే తాను పోరాటం చేస్తాన‌ని మాట ఇచ్చారు.

ఆ మాట ఇచ్చి మూడేళ్ల‌కు పైనే అయ్యింది. అయితే.. నాటి మాట‌ను ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ళ్లీ ప్ర‌స్తావించింది లేదు. పార్టీ ప్లీన‌రీ స‌మావేశం నుంచి బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్న ప‌వ‌న్‌.. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌ధాని భూసేక‌ర‌ణ మీద పెద‌వి విప్పారు. అమ‌రావ‌తి ప్రాంతంలో 120 ర‌కాల పంట‌లు పండే భూముల్ని బ‌లవంతంగా సేక‌రించేందుకే ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డితే.. ఎదురు తిర‌గాల‌ని రైతుల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లి రైతుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. రైతుల పోరాటానికి అండ‌గా నిలిచి వెంట ఉంటాన‌ని.. పోలీసులు తూపాకీల‌తో భ‌య‌పెట్టాల‌ని చూస్తే.. ముందు త‌న గుండె చూపిస్తాన‌న్నారు. వెయ్యి తూటాల్ని ఎదిరించైనా రాజ‌ధాని ప్రాంతంలో బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌ను ఆపుతాన‌న్నారు. మూడు పంట‌లు పండే భూముల్ని మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడింత సీరియ‌స్ గా మాట్లాడిన ప‌వ‌న్‌.. తాను చెప్పిన మాట మీద నిల‌బ‌డ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.