Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను క‌డిగేసే ద‌మ్ము ప‌వ‌న్ కు మాత్ర‌మే ఉందా?

By:  Tupaki Desk   |   5 April 2019 4:45 AM GMT
కేసీఆర్ ను క‌డిగేసే ద‌మ్ము ప‌వ‌న్ కు మాత్ర‌మే ఉందా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఒక మాట అనాలంటే అందుకు నాలుగైదు గుండెలు కావాల్సిందే. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా అది నిజం. గ‌తాన్ని గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న్ను ఉద్దేశించి ఏ చిన్న విమ‌ర్శ చేయ‌టానికి తోపుల్లాంటి నేత‌లు సైతం కిందామీదా ప‌డేటోళ్లే త‌ప్పించి గ‌ట్టిగా ఒక విమ‌ర్శ చేయ‌టానికి వెనుకాడేవారు. ఎందుకంటే.. కేసీఆర్ ను అంటే తెలంగాణ సెంటిమెంట్ ను దెబ్బ తీసిన‌ట్లుగా నేత‌ల్లో భావ‌న ఉండేది. నిజానికి కేసీఆర్ వేరు.. తెలంగాణ సెంటిమెంట్ వేర‌న్న విష‌యాన్ని పోటుగాళ్లుగా చెప్పుకునే ఏ తెలంగాణ నేత వేరు చేసి కేసీఆర్ ను మాట‌ల‌తో ఉతికి ఆరేసినోళ్లు లేరు.

కేసీఆర్ వ్యూహంలో నేత‌లు చిక్కుకోవ‌ట‌మే కానీ.. ఆయ‌న్ను త‌మ వ్యూహంలో ప‌డేలా చేసిన తెలివి ఏ నేత‌కు లేద‌ని చెప్పాలి. అది చంద్ర‌బాబు కావొచ్చు.. వైఎస్ జ‌గ‌న్ కావొచ్చు.. మ‌రెవ‌రైనా కావొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ కొత్త త‌ర‌హా అనుభ‌వాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు పంచుతున్న ఏకైక నేత‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చెప్పాలి.

మోడీ.. కేసీఆర్.. చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవ‌రినైనా స‌రే ఉతికి ఆరేయ‌టం.. వారిని త‌న మాట‌ల‌తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేయ‌టంలో ప‌వ‌న్ కు మించినోడు లేడ‌ని చెప్పాలి. ప్ర‌తి పార్టీ అధినేత‌కు కొన్ని ప‌రిమితులు ఉంటాయి. అందుకు మిన‌హాయింపుగా ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు ఆయ‌న‌తో పాటు.. ఆ స్థానాన్ని సొంతం చేసుకున్న అధినేత‌గా జ‌న‌సేనానిని చెప్పుకోవాలి.

ఏపీకి ద్రోహం చేశారంటూ మోడీని ఉతికేసినా.. ఏపీని మీకు.. మీ అబ్బాయికి రాసిచ్చామంటూ బాబును అన్నా.. జ‌గ‌న్ లాంటి నేర‌స్తుడు ఏపీకి ముఖ్య‌మంత్రి అయితే ఇంకేమైనా ఉందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించినా.. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంటిని సీజ్ చేసుకోవాల‌నటం.. ఆంధ్ర ప్ర‌జ‌లు వేరు.. ఆంధ్రా పాల‌కుడైన చంద్ర‌బాబు వేర‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దన‌టం ప‌వ‌న్ కే సాధ్య‌మ‌ని చెప్పాలి. బాబు మీద క‌క్ష‌తో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇవ్వ‌టం జ‌న‌సేనానికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ ప్ర‌జ‌ల కోసం.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే మాట్లాడే నేత ఒక్క కేసీఆర్ మాత్ర‌మే అన్న భావ‌నే ఆయ‌న్ను తెలంగాణలో తిరుగులేని శ‌క్తిగా మార్చింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఏపీకి కేసీఆర్ త‌ర‌హా అధినేత లేడ‌న్న మాట ప‌లువురి నోట వినిపించేది. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఆ లోటును ఆయ‌న తీరుస్తున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ముఖ్యం. ఆ త‌ర్వాతే ఎవ‌రైనా.. ఏ రిలేష‌న్ అయినా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన నేత ఏపీలో ఎవ‌రూ లేరు. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఆ లోటును తీర్చే నాయ‌కుడిగా చూపిస్తున్నాయి. అయితే.. ఆ విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తిస్తారా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.