Begin typing your search above and press return to search.

పవన్ ఘాటు వ్యాఖ్యలు: పాక్ లో అలా చేస్తారని చదివాం.. ఏపీలో చూస్తున్నాం

By:  Tupaki Desk   |   2 Jan 2021 3:45 AM GMT
పవన్ ఘాటు వ్యాఖ్యలు: పాక్ లో అలా చేస్తారని చదివాం.. ఏపీలో చూస్తున్నాం
X
ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణంగా ఏదైనా ఒక అంశం మీద రగడ జరగటం.. ప్రభుత్వం ఇరుకున పడటం సహజం. అందుకు భిన్నంగా పలు అంశాలు ఒకేసారి ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇలాంటి అనుభవమే ఆయనకు ఎదురవుతోంది. ఏ రోజు కుదురుగా కూర్చోలేని పరిస్థితి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకునే ఉదంతాలకు మించినట్లుగా ఇప్పుడో కొత్త అంశం పెద్ద ఇష్యూలా మారుతోంది.

హిందూ దేవాలయాల మీద దాడి జరగటం.. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా వారంలో రెండు ఉదంతాలు చోటు చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. దేవతా విగ్రహాల ధ్వంసంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఇష్యూలోకి దాయాది దేశమైన పాక్ ను ప్రస్తావించటం ద్వారా ఇష్యూను మరింత జటిలం చేస్తున్నారని చెప్పాలి. దేవతా విగ్రహాల విధ్వంసం కచ్ఛితంగా ప్రభుత్వ వైఫల్యమేూనని చెప్పిన ఆయన.. పాకిస్తాన్ లో హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం గురించి చదువుతున్నామని.. ఇప్పుడు ఏపీలో కూడా అదే తరహాలో విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నామన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

‘ఆంధ్ర ప్రదేశ్ లో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరం. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకొందని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. పాకిస్థాన్ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం’’ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

రామనామాన్ని జపించే పవిత్ర భూమి మనదన్న జనసేనాని.. రామ కోటిని భక్తి పూర్వకంగా రాసే నేల అన్న విషయాన్నిగుర్తు చేశారు. దేశంలో రామాలయం లేని ఊరంటూ కనిపించదన్న పవన్.. రాముడ్ని ఆదర్శంగా తీసుకుంటామన్నారు. అలాంటి మన రాష్ట్రంలో అలాంటి భావనల్ని చెరిపేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. భద్రచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలని భావిస్తున్న రామతీర్థం క్షేత్రంలో కొద్దిరోజుల క్రితమే కోదండరాముల వారి విగ్రహాన్ని తలను నరికి పడేసే మత మౌధ్యం పెచ్చరిల్లటం ఆందోళన కలిగించే అంశమన్నారు.

‘‘ఆ బాధ భక్తుల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు దేవ గణాలకు సేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహా చేతుల్నినరికేయటం ధ్వంస రచనకు పరాకాష్టకు చేరుతున్నట్లు అనిపిస్తుంది. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తుంటే.. ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది’’ అని పవన్ పేర్కొన్నారు. రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందన ఉదాసీనంగా ఉందన్నారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడని చెప్పటం చూస్తే.. వరుస దాడులపై సీఎం ఎంత నిర్లప్తంగా ఉన్నారో అన్న భావన కలుగక మానదన్నారు.

పోలీసు.. నిఘా విభాగాలు ఉంటాయి కదా? బాధ్యుల్ని ఇప్పటివరకు ఎందుకు గుర్తించిన అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడుల్ని అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు.. రథాల దగ్థాల్ని ఖండించాలన్నారు. మరి.. పవన్ వ్యాఖ్యలపై మిగిలిన మతాలకు చెందిన వారి స్పందన ఏమిటో చూడాలి.