Begin typing your search above and press return to search.

బాబుతో భేటీలో పవన్ కు అవగాహన కలిగినట్టే

By:  Tupaki Desk   |   14 Nov 2015 4:02 AM GMT
బాబుతో భేటీలో పవన్ కు అవగాహన కలిగినట్టే
X
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చే విషయంలో ఇష్టం లేని రైతుల వాదనను గట్టిగానే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు చెప్పదలచుకున్నారు. అయితే ఆయనతో భేటీ అయిన సందర్భంగా ఏపీ సర్కారు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులు - సాధకబాధకాలు అన్నీ తెలుసుకున్న పవన్ కల్యాణ్ బాబు అనుసరిస్తున్న ఎప్రోచ్ పట్ల అవగాహనతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది.

ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో ఎదురవుతున్న కష్టాలన్నిటినీ చంద్రబాబు నివేదించి, కేంద్రంనుంచి ఎలాంటి సహాయ నిరాకరణ కనిపిస్తున్నదో పేర్కొని... మొత్తానికి చంద్రబాబు పాలన తీరు మీద పవన్ లో ఏమైనా భిన్నాభిప్రాయం ఉంటే గనుక... దానిని పూర్తిగా తుడిచిపెట్టేసినట్లు తెలుస్తున్నది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం రెండుగంటల పాటు ఏకాంత భేటీ జరిపిన విషయం తెలిసిందే. కానీ అది ఏకాంత భేటీ కాదని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్ ఈ దఫా మాత్రం తన డిమాండ్లను బాబు ముందు ఏకరువు పెట్టారని నిర్ధారణ అయింది. రాజధాని అమరావతిలో రైతులు ఇంతవరకు ఇవ్వని భూములను భూసేకరణ కింద స్వాధీనపర్చుకోవడాన్ని పవన్ ప్రశ్నించారు.

దీనికి చంద్రబాబు సమాధానం తాను ఇవ్వకుండా రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ అయిన కమిషనర్ శ్రీకాంత్‌ చేత మాట్లాడించారని సమాచారం. అమరావతిలో భూసమీకరణ ద్వారా సేకరించిన భూమి పక్కనే ఉన్న రైతుల భూముల గురించి శ్రీకాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులు ఇంకా స్వాధీనపర్చకుండా తమ చేతిలోనే ఉంచుకున్న భూములను ప్రభుత్వం సేకరించకపోతే ఇప్పటికే రూపొందించి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ కు ఆటంకం ఏర్పడుతుందని సీఆర్‌ డీఏ కమిషనర్ శ్రీకాంత్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవన్‌ కు వివరించి చెప్పారట.

దీంతో ఒక మేరకు సంతృప్తి చెందిన పవన్ ఈవిషయమై రైతులకు నచ్చచెప్పాల్సిందిగా చంద్రబాబును కోరారు. భూములను ఇచ్చేది లేదని మొరాయిస్తున్న రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని కోరినట్లు సమాచారం. మొత్తానికి రైతు లసమస్యలను ప్రస్తావించడానికి పవన్ చేసిన ప్రయత్నం సామరస్య పూర్వకంగా ముగిసినట్లు తెలుస్తోంది.