Begin typing your search above and press return to search.

అయ్యన్నకు అదిరిపోయే పంచ్ వేసిన పవన్

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:32 AM GMT
అయ్యన్నకు అదిరిపోయే పంచ్ వేసిన పవన్
X
తమవైపు తప్పులు ఉన్నప్పుడు వీలైనంతగా నోరు మూసుకొని ఉండాలి. అలా కాకుండా అడ్డదిడ్డమైన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తే అందుకు ఫలితం అనుభవించాల్సిందే. ఈ విషయం ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఈపాటికి అర్థమై ఉంటుంది. తాము చేతకాక వదిలేసిన అంశాన్ని.. పట్టుదలతో ముందుకు తీసుకెళుతున్న పవన్ పై మాటల దాడికి దిగిన అయ్యన్నకు అదిరిపోయేలా ట్వీట్ పంచ్ లు ఇచ్చారు పవన్ కల్యాణ్.

ఎన్నికల ప్రచారంలో మోడీ పక్కనే కూర్చున్న పవన్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి హోదా గురించి కూడా మాట్లాడొచ్చుగా అంటూ.. పవన్ పై నింద వేసే ప్రయత్నం చేసిన అయ్యన్న నోటి వెంట మాట రాని విధంగా ట్వీట్ చేసిన పవన్.. ‘‘పెద్దలు అయ్యన్నపాత్రుడుగారు నన్ను మోడీతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే..నేను మోడీగారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను. కానీ.. మీ ఎంపీలు అందరూ పార్లమెంట్లో ఆయనతో కూర్చుంటున్నారు కదా. మరి వారేం చేస్తున్నారు? మీడియా ముందుకు వచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వదని చెప్పటం తప్ప. అసలు ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పటానికికూడా మీరు భయపడితే ఎలా?’’ అంటూ ఏపీ అధికారపక్షం చేతకాని తనాన్ని.. మోడీ అంటే వారికున్న భయాన్ని తన ట్వీట్ తో స్పష్టం చేశారు.

ఈ ట్వీట్ కు కంటిన్యూషన్ గా తాజా పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మీరు ఆ పని చేయకపోబట్టేకదా ఈ రోజు యువత రోడ్ల మీదకు వస్తుంది. మీరు ఏమీ చేయకండి. యువతను ఏమీ చెయ్యనీకండి. మరి దీనికి పరిష్కారం ఏమిటి?’’ అంటూ తన సందేహాన్ని సంధించారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి తెలుగు తమ్ముళ్లు చేతకాని దద్దమ్మల్లా చేష్టలుడిగి కూర్చుండిపోయారన్న అర్థం వచ్చేలా సూటిగా పవన్ చేసిన ట్వీట్ చూస్తే.. కదిలించుకొని మరీ తిట్టించుకున్నట్లుగా ఉందని చెప్పక తప్పదు. హోదా విషయంలో తాము చేస్తున్న తప్పుల్ని కప్పి పుచ్చటానికి మాటలతో పవన్ పై నిందలు వేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. ఆచితూచి మాట్లాడకపోతే.. అంతకంత అన్న చందంగా పవన్ నుంచి రియాక్షన్ తీవ్రంగా వస్తుందన్న విషయం తాజా ట్వీట్లు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/