Begin typing your search above and press return to search.

పవన్ షాకింగ్ కామెంట్లు: సొంత మంత్రి ఇంటిని తగలెట్టించారు.. పరామర్శించలేదు

By:  Tupaki Desk   |   27 Jan 2023 11:45 AM GMT
పవన్ షాకింగ్ కామెంట్లు: సొంత మంత్రి ఇంటిని తగలెట్టించారు.. పరామర్శించలేదు
X
ట్రిగ్గర్ ఒకసారి నొక్కిన తర్వాత వరుస పెట్టి బుల్లెట్లు దూసుకొచ్చే తీరుకు ఏ మాత్రం తేడా లేని రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు ఉంటున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాల ధోరణి మారింది. గతంలో ఏదో మొదలు పెట్టి మరేదో విషయానికి వెళ్లినట్లుగా కొందరు భావించే వారికి సైతం ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మాటలు నచ్చుతున్నాయి. అన్నింటికి మించి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎవరూ చేయని వ్యాఖ్యలతో పాటు.. ఒక్కసారి ఉలిక్కిపడేలా ఆయన మాటలు ఉంటున్నాయి. అందుకు నిదర్శనంగా మంగళగరి పార్టీ ఆఫీసులో గణతంత్రదినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడిన మాటల్ని చెప్పాలి.

పవన్ ఏమన్నారు? ఆయన చేసిన వ్యాఖ్యల్లో మంట పుట్టే మాటలు ఏమున్నాయి? ముఖ్యమంత్రి జగన్ మీద ఆయన చేసిన ఆరోపణలు ఏమిటి? లాంటివే కాదు.. తనను విమర్శించే ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జలకు సూటిగా తగిలే ఒక పంచ్ కూడా ఉండటం గమనార్హం. పవన్ చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- కోనసీమలో నాలుగు కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుందామని అనుకున్నారు. సొంత మంత్రి ఇంటిని తగులబెట్టించారు. కనీసం ఈ రోజు వరకు ఆయన్ను పరామర్శించింది లేదు. ఆ కేసు ఏమైందో తెలీదు.

- వైసీపీ నాయకుడికి అధికారం కోసం కింది కులాల్ని వాడుకోవాలనే తాపత్రయం.. అధిపత్య ధోరణి తప్ప మరేం లేవు.

- మొన్న రాజమహేంద్రవరానికి చెందిన ఒక వైసీపీ నాయకురాలు కులాలను కించపరిచేలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె అధికార పార్టీలో పదవి కూడా ఉంది. ఆ వ్యాఖ్యలు ఇతర కులాల్ని తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయి. కనీసం ఆ పార్టీ నాయకురాలి మీద వైసీపీ నాయకత్వం చర్యలు తీసుకున్నది లేదు.

- ప్రతి కులానికి ఆత్మాభిమానం ఉంటుంది. దానిని కించపరిచే మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఆంధ్ర ప్రజలకు కులం మీద ఉన్న పిచ్చి ఆంధ్రజాతి మీద లేదు.

- ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేతలు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు రాయలసీమ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా? రాయలసీమకు వారు చేసిందేమిటి? ఇప్పుడు కొత్తగా మీరు చేసేదేమిటి? మీకు పదవులు లేనప్పుడు మీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీయండి అంటే.. తోలు తీసి కూర్చోబెడతాం.

- ఇప్పటికే చాలా విసిగిపోయి ఉన్నాం. మీ డ్రామాలు ఆపండి. ముందు కర్నూలులో వలసల గురించి.. సాగునీటి సమస్యల గురించి.. కడప ఉక్కు పరిశ్రమ వంటి వాటి మీద మాట్లాడండి. అంతేకానీ ఇష్టానుసారం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల గురించి మాట్లాడితే సహించేది లేదు.

- చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. మొన్నటి వరకు కొందరు వ్యక్తులు వారాహి ఎలా తిరుగుతుందో చూస్తాం.. చేస్తామంటూ పెట్రేగిపోయారు. వేల కోట్లు.. వేలాది ఎకరాలు దోచేసే మీకే అంత నోరు ఉంటే.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. నాతో గొడవ పెట్టుకోవద్దు. నేనేంటో చూపిస్తా.

- ఇటీవల ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు ఏ ఫిర్యాదు ఇచ్చారు.. ఏం మాట్లాడారు అంటూ సకల శాఖ మంత్రి సజ్జల తెగ ఆరాటం చూపించారు. ఈసారి మాత్రం కచ్ఛితంగా మోడీని కలిసినప్పుడు రాష్ట్రంలో హిందూ ఆలయాల ధ్వంసం గురించి ఫిర్యాదు చేస్తా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.