Begin typing your search above and press return to search.

పవన్ ఒకరిని టార్గెట్ చేస్తే.. తాతా ముత్తాల చరిత్రను తవ్వితీస్తారా?

By:  Tupaki Desk   |   19 Jun 2023 10:01 AM GMT
పవన్ ఒకరిని టార్గెట్ చేస్తే.. తాతా ముత్తాల చరిత్రను తవ్వితీస్తారా?
X
కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అధికార వైసీపీకి చెందిన నేతలపై మాటల శతఘ్నితో దాడి చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. కాకినాడ సభలో వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల ప్రస్తావను తీసుకొచ్చారు. తాను ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వారి చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తానన్న విషయాన్ని తాజా సభతో స్పష్టం చేశారని చెప్పాలి. ఒక ఎమ్మెల్యే అవినీతిని ప్రస్తావించటమే కాదు.. అతడు పోగేసిన ఆస్తుల గురించి.. వారి నేరచరిత్రను ఇంత డీటైల్డ్ గా ఏ రాజకీయ నేత ప్రస్తావించలేదన్న మాట వినిపిస్తోంది.

సాధారణంగా ఒక పార్టీ అధినేత ఎవరైనా సరే.. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడి మీద నిప్పులు చెరగటం మామూలే అయినా.. ఇంత లోతుగా అధ్యయనం చేసి మరీ టార్గెట్ చేయటం కనిపించదు. తాను టార్గెట్ చేసినోడి పుట్టుపూర్వోత్తరాల గురించి ఇంతలా స్టడీ చేయటమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ సభతో పవన్ తనలోని విశ్వరూపాన్ని చూపించినట్లుగా చెప్పారు. ప్రత్యర్థి బలం.. బలుపు లెక్క తనకు తెలుసంటూ మాట్లాడిన ఆయన.. అవినీతి ఏ రేంజ్ లో ఉంటుందో? ఎంత అక్రమ సంపాదన ఆయన వెనుకేశారన్న విషయాన్నిఇంత ఓపెన్ గా చెప్పేయటం సంచలనంగా మారింది.

అంతేకాదు.. వారి వంశ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఏ మాట అంటే ఎంతలా తగులుతుందో తనకు బాగా తెలుసన్న విషయాన్ని పవన్ తన మాటలతో చెప్పేశారని చెప్పాలి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేసిన పవన్ కల్యాణ్ మాటల్లో మరో కోణాన్ని కూడా చూడాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ తాతకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. నీకు అలాంటి గతే తప్పదన్న మాటను అనటం ద్వారా విషయాన్ని పవన్ కల్యాణ్ మరో లెవల్ కు తీసుకెళ్లారన్న మాట బలంగా వినిపిస్తోంది.

'జనసేన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తాతను బేడీలు వేసి జైలుకు పంపించిన అప్పటి ఎస్పీ డీటీ నాయక్ లా నేను బీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ చూపిస్తాను. ఎమ్మెల్యేను జైలుకు పంపి క్రిమినల్స్ ను ఏరిపారేస్తా' లాంటి షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. కాకినాడ సిటీలో మాట్లాడిన పవన్ ప్రసంగంలో ద్వారంపూడి అక్రమాస్తుల గురించి పవన్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. తాను మాట్లాడటానికి ముందు అతడి గురించి మొత్తం అధ్యయనం చేసిన విషయాన్ని పవన్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి.

''ద్వారంపూడి నీ నేర సామ్రాజ్యం నేలకూలుస్తా. నీకు రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్త. ఈ నాలుగేళ్లలో నీ కుటుంబం అక్రమ సంపాదన రూ.15వేల కోట్లు. ఎక్కడైనా స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడటం.. అడ్డొచ్చిన వారిపూ దౌర్జన్యాలకు పాల్పడటం.. గంజాయి సరఫరా.. బియ్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమార్జనతో బలిసి ఉన్నాడు. అతడి అక్రమాట చిట్టా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ఉంది. ఏమూలకు వెళ్లినా అతడి అక్రమ బాగోతాలే బయటపడుతున్నాయి' అని నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు.

ద్వారంపూడి చేసే అక్రమ వ్యాపారాలు.. నేరాలపై పవన్ ప్రస్తావించిన చిట్టాను చూస్తే..

- అక్రమ బియ్యం వ్యాపారం

- తెలంగాణ.. యానం నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారు

- ముత్తా సర్వారాయుడిగారి ఐదు ఎకరాల భూమిని వైసీపీ నాయకులు తీసుకున్నారు

- 1800లో బర్మా రంగూన్ కు వెళ్లి వచ్చిన డబ్బును సత్యలింగనాయకర్ స్కూళ్లు.. కాలేజీలు కట్టించారు. వాటిని ఎమ్మెల్యే కొట్టేస్తున్నాడు.

- స్వామినగర్‌లో నిరుపేదల ఇళ్ల పట్టాలను వైసీపీ నాయకులు అమ్మేసుకున్నారు.

- ద్వారంపూడి కుటుంబీకులు మిల్లర్ల ద్వారా ఇతర దేశాలకు బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ కోట్లు అక్రమార్జన చేస్తున్నారు.

- వైసీపీ అధికారంలో లేనప్పుడు కాకినాడ పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు 18 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం వెళ్తే ఇప్పుడు 56 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి కుటుంబం అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

- ప్రజలకు రోడ్లు లేకపోయినా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తన రొయ్యల ఫ్యాక్టరీ కోసం ప్రజాధనం రూ.8 కోట్లతో వంతెన వేయించుకున్నాడు.

- అక్రమ బియ్యం వ్యాపారంతో రూ.15 వేల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే సింహాచలం పాదయాత్రలో కొవిడ్‌ రోగులకు ప్రభుత్వ ధనంతో కొన్న మంచాలు, బకెట్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లిన ఘనుడు.

- జయలక్ష్మి కోఆపరేటివ్‌ సొసైటీ రూ.800 కోట్లు సేకరించి బోర్డు తిప్పేస్తే బాధితుల పక్షాన ఉండకుండా నిర్వాహకుల పక్షాన ఉన్నాడు.

- మత్స్యకారుల జీవనాధారమైన సముద్రతీరంలో ఉన్న భూమి కబ్జాకు పాల్పడ్డారు.

ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన ఇంత చిట్టాను తన ప్రసంగంలో పవన్ ప్రస్తావించారంటే.. ఎంతటి అధ్యయనం.. మరెంతటి సమాచారాన్ని సేకరించి ఉంటారో అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా పవన్ ప్రసంగం ఇప్పుడు సంచలనంగా మారటమేకాదు.. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 'ఘన'చరిత్రను పవన్ కల్యాణ్ ఘనంగా బయటపెట్టారన్న మాట బలంగా వినిపిస్తోంది.