Begin typing your search above and press return to search.

విమర్శించే ఛాన్స్ పవన్ కు జగన్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   8 Aug 2019 10:51 AM GMT
విమర్శించే ఛాన్స్ పవన్ కు జగన్ ఇచ్చారా?
X
జగన్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓపక్క టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయి.. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయని వేళ.. దాన్ని భర్తీ చేస్తూ.. ప్రతిపక్ష పాత్రను తాను పోషించాలన్నట్లుగా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు పవన్. ఇందులో భాగంగా తాజాగా మెడికల్ విద్యార్థుల మీద అదికారులు.. పోలీసులు చేసిన తప్పుల్ని ప్రభుత్వానికి అన్వయిస్తూ పవన్ విమర్శనాస్త్రాల్ని సంధించటం గమనార్హం.

తాజాగా జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం తెలిసిందే. వీరి నిరసనను నిలువరించే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం జూనియర్ డాక్టర్లను కాళ్లతో తన్నటం.. చెంపదెబ్బలు కొట్టటం లాంటి పనులు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.

జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నటం బాధాకరమన్న ఆయన.. వైద్య విద్యను అభ్యసిస్తున్న వారి విషయంలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించటం తప్పన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యల మీద స్పందించకపోగా.. వారిపై దాడి చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. విజయవాడ.. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనపై ప్రభుత్వంపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లలో స్థైర్యం పెంచాలన్నారు. జగన్ పై పవన్ విమర్శల్ని చూస్తే.. ఆయన బాబు ప్లేస్ ను తాను భర్తీ చేయాలన్నట్లుగా కనిపించక మానదు. ఎన్నికల్లో ఓటమి అనంతరం.. ఏ విషయం మీద బాబు మాట్లాడినా.. అది ఆయనకు రివర్స్ గా మారుతున్న వేళ.. ఇటీవల కాలంలో బాబు ఇష్యూల మీద మాట్లాడటం తగ్గించారు. దీన్నో అవకాశంగా తీసుకున్న పవన్.. జగన్ ను ఇష్యూ బేస్డ్ గా విమర్శించటం ద్వారా ప్రతిపక్ష స్థానాన్ని సొంతం చేసుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లుగా చెప్పక తప్పదు. తాజా ఉదంతాన్ని చూస్తే.. మెడికల్ విద్యార్థులపై అధికారులు దురుసుతనంలో ప్రభుత్వాధినేత పాత్ర నేరుగా ఏమీ ఉండదు. అధికారులు ప్రభుత్వంలో భాగమే అయినా.. వారి తీరును జగన్ ఖాతాలో వేయాలన్నట్లుగా పవన్ విమర్శలు ఉండటాన్ని చూస్తే.. ఆయన లక్ష్యం ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు.