Begin typing your search above and press return to search.

పవన్ కు మించిన మిత్రుడు బాబుకు దొరకరేమో?

By:  Tupaki Desk   |   10 Nov 2016 3:43 PM GMT
పవన్ కు మించిన మిత్రుడు బాబుకు దొరకరేమో?
X
స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? కష్టంలో అండగా నిలవాలి. తప్పు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తప్పు జరుగుతుంది.. తప్పు చేస్తున్నావని చెప్పగలగాలి. తన మిత్రుడికి నష్టం జరగకుండా చూడాలి. వ్యక్తిగతంగా ఏమో కానీ.. రాజకీయాల్లో ఇలాంటి మిత్రత్వాలు పెద్దగా కనిపించవు. కానీ.. సార్వత్రిక ఎన్నికల్లో మిత్రుడిగా వ్యవహరించి ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తనలోని మిత్రకోణాన్ని మరోసారి ప్రదర్శించారు.

తాజాగా అనంతపురం సభలో మాట్లాడిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి.. తన పాత మిత్రుడైన చంద్రబాబుకు ఆయన సర్కారుకు సంబంధించిన కీలకాంశాల విషయంలో చేస్తున్న తప్పుల్ని బయట పెట్టటమే కాకుండా.. ఏం జరుగుతుందో చూసుకోవాలన్న సలహాను ఇవ్వటం గమనార్హం. బాబు చుట్టూ ఉండే కోటరి ఏ విషయాన్ని అయితే ఆయనకు చెప్పటానికి ససేమిరా అంటారో.. అదే విషయాన్ని లక్షలాది మంది ప్రజల ముందు బాబుకు అర్థమయ్యేలా పవన్ చెప్పేశారని చెప్పాలి. బాబు క్షేమం కోరే వారు తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక సతమతమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా పవన్ ఓపెన్ గా చెప్పేయటం గమనార్హం.

ఏపీ సర్కారులో అవినీతి పెరిగిపోయిందన్న ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఒక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని.. ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పటం ద్వారా..చంద్రబాబు సర్కారులోని లోపాల్ని పవన్ ఎత్తి చూపారని చెప్పక తప్పదు. గత రెండు సభల్లో చంద్రబాబుపై విమర్శలు చేయలేదని.. బాబుతో చేసుకున్న ముందస్తు ఒప్పందంలో భాగంగానే పవన్ సభల్ని పెడుతున్నారని ప్రచారం చేసే వర్గానికి మింగుడు పడని రీతిలో తాజాగా చేసిన విమర్శలు ఇప్పుడుసంచలనంగా మారుతున్నాయని చెప్పక తప్పదు.

2014 ఎన్నికల్లో అవినీతి గురించి విపరీతంగా మాట్లాడే చంద్రబాబు.. ఇప్పుడు కూడా అవకాశం వచ్చిన ప్రతిసారీ అవినీతికి తాను వ్యతిరేకమని.. అవినీతిని అస్సలుసహించనని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే.. ఆయన మాటలకు.. ఆయన ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉందని.. ఏపీ ప్రభుత్వంపై అవినీతి మరక పడిందన్న వాదన బయట చాలా ఎక్కువగా వినిపిస్తుందన్న విషయాన్ని పవన్ చెప్పేశారు.అయితే.. తనకు వినిపించిన మాటలకు సంబంధించిన ఆధారాలు లేని విషయాన్ని ఆయన చెబుతూనే.. తనకువినిపించిన మాటల్ని చంద్రబాబు చెక్ చేసుకోవాలన్న మాటను చెప్పేశారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా వ్యవహరించి.. తన పూచీకత్తు మీద టీడీపీ.. బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన పవన్.. తాజాగా ఏపీ సర్కారుపై అవినీతి జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుందని.. ఆ విషయాలు తన దృష్టికి వచ్చాయని.. ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయని.. వీటిపై బాబు దృష్టి పెట్టాలని చెప్పటం చూసినప్పుడు.. పవన్ లాంటి మంచి మిత్రుడు బాబుకు దొరకడని చెప్పక తప్పదు. మరి.. మిత్రుడు పవన్ ఎత్తి చూపిన లోపాలపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/