Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సీఎం కుర్చీ లాక్కునేవాణ్ని..

By:  Tupaki Desk   |   10 Oct 2018 9:00 AM GMT
చంద్ర‌బాబు సీఎం కుర్చీ లాక్కునేవాణ్ని..
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల జ‌డిని మ‌రింత పెంచారు. తాను త‌ల్చుకుంటే బీజేపీతో చేతులు క‌లిపి ఎప్పుడో ఆయ‌న సీఎం కుర్చీని లాక్కునేవాన్న‌ని.. అయితే, అలాంటి నీచ బుద్ధి త‌న‌కు లేద‌ని ఉద్ఘాటించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ద‌త్త‌పుత్రుడిగా త‌న‌ను అభివ‌ర్ణిస్తున్న టీడీపీ నేత‌ల‌పైనా ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు. అలాంటి మాట‌లు మానుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. తాను ఎవ‌రి ద‌త్త‌పుత్రుడినీ కాద‌ని.. కొణిదెల వెంక‌ట్రావు కుమారుడిని మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

గత ఎన్నికల్లో తాను ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా టీడీపీకి మ‌ద్ద‌తిచ్చాన‌ని ప‌వ‌న్ తెలిపారు. అప్పట్లో మద్దతు కోరుతూ చంద్రబాబే తన వద్దకు వచ్చారన్నారు. 2014 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోరినా తాను వెళ్లలేదని పేర్కొన్నారు. ఇక ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని మొదట నిలదీసింది తానేన‌ని ప‌వ‌న్ గుర్తుచేశారు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని తాను అంటే బీజేపీతో కలిసి టీడీపీ తనపై విమర్శలు చేసిందన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అంబారీలను ఎక్కించి బీజేపీ వాళ్లకు సన్మానాలు చేసింది ఎవరంటూ చంద్ర‌బాబును ప‌వ‌న్‌ నిలదీశారు. హోదాపై తానేమ‌న్నానో.. చంద్రబాబు ఏమన్నారో వీడియోలు విడుదల చేస్తానని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. అప్పుడే అంద‌రి గుట్టు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అన్నారు.

టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన‌ప్పుడు త‌న‌ను దేశ‌భ‌క్తుడ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు అవినీతిపై ప్ర‌శ్న‌లు వేయ‌డంతో త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడ‌ని ప‌వ‌న్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారో చెప్పాలని ప్ర‌శ్నించారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం పారిశ్రామిక వేత్త‌ల వ‌ద్ద బాబు డ‌బ్బులు దాచుకున్న విష‌యం ఆయ‌న ఉలికిపాటుతో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారు. రాష్ట్రంలో 18 లక్షల మంది జ‌న సైనికుల‌ ఓట్లను ప్ర‌భుత్వం అక్ర‌మంగా తొలగించింద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. జనసైనికులంతా మ‌ళ్లీ ఓటు న‌మోదు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. చంద్రబాబు రూ.3.5లక్షల కోట్లు దోచారని జగన్‌.. జగన్ రూ.లక్షన్నర కోట్లు దోచేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు. ఆ ఇద్దరూ చెప్పిన రూ.5లక్షల కోట్ల సొమ్మును ప్రజలకు పంచాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు.

సీఎం పీఠం కంటే.. కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల్లో స్థానానికి తాను ఎక్కువ విలువిస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. వాస్త‌వానికి తాను త‌ల్చుకుంటే బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు సీఎం కుర్చీని ఎప్పుడో లాక్కునేవాన్న‌ని తెలిపారు. కానీ, అలాంటి పాడు తెలివితేట‌ల‌తో ముఖ్య‌మంత్రిని కావాల‌ని తాను భావించ‌డం లేద‌న్నారు. ఏదైనాస‌రే ప్రజల ద్వారా, ప్రజా విప్లవం ద్వారా రావాలని అభిల‌షించారు.