Begin typing your search above and press return to search.

ట్రెండ్ సెట్ సెట్ చేయ‌డ‌మంటే... ఇదా ప‌వ‌న్ !?

By:  Tupaki Desk   |   25 May 2018 4:39 PM GMT
ట్రెండ్ సెట్ సెట్ చేయ‌డ‌మంటే... ఇదా ప‌వ‌న్ !?
X
సినిమాల‌లో ప‌వ‌ర్ స్టార్ అంటారు. బ‌హుశా అభిమానుల్లో ఉన్న క్రేజు కావ‌చ్చు. ఆ అభిమానులు ఆయ‌న‌ను *ట్రెండ్ సెట్ట‌ర్* అంటూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇపుడు అదే ప‌దంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఉద్దానం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని త‌న మాజీ పార్ట‌న‌ర్ చంద్ర‌బాబుకు 48 గంట‌లు డెడ్‌లైన్ విధించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌రిష్కారం క‌నుక్కోక‌పోతే యాత్ర ఆపేసి తాను నిరాహార దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు విచిత్రంగా ఉన్నాయి. జ‌న‌సేన చ‌ర్య‌లు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి.

యాత్ర ఆపేసి నిరాహార దీక్ష చేస్తాడంటే చంద్ర‌బాబు దిగొచ్చేదాకా చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు.. కానీ ఒక్క రోజు మాత్ర‌మే నిరాహార దీక్ష అన‌డంతో పార్టీలోనూ, ప్ర‌జ‌ల్లోనూ నిట్టూర్పు వ‌చ్చింది. ఇంకో షాక్ ఏంటంటే... రెండు రోజులుగా రిసార్టులో విశ్రాంతి తీసుకుంటున్న ప‌వ‌న్ *ఈ సాయంత్రం నుంచి అక్క‌డే నిరాహార దీక్ష మొద‌లెట్టాడు* అని స‌డెన్‌గా ఒక ప్రెస్‌నీట్ రిలీజ్ అయ్యింది. ఒక రోజు దీక్ష అన్న వెంట‌నే నీర‌స‌ప‌డిన కార్య‌క‌ర్త‌లు ఈ సాయంత్ర‌పు దీక్ష‌తో, అది కూడా రిసార్టు దీక్ష‌తో ఖంగుతున్నారు. రిసార్టులో దీక్ష చేసి దీక్ష‌ల్లో ప‌వ‌న్ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యాడంటూ ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో అభిమానులు మొహం తిప్పేసుకుంటున్నారు. దానికి ఏం ప్రామాణిక‌త ఉంటుంది? ప‌్ర‌జ‌ల మ‌ధ్య నిరాహార దీక్ష చేస్తేనే జ‌నం గ‌ట్టిగా న‌మ్మే ప‌రిస్థితి లేన‌పుడు ఇలా రిసార్టుల్లో దీక్ష‌లేంటి బాబాయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంత‌కీ జ‌న‌సేన చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఏముందంటే... *ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని* పార్టీ పేర్కొంది.
ఇక ఈ మ‌ధ్యే పుస్త‌కాలు చ‌దివి జ‌ర్న‌లిస్టుల‌కు పాఠాలు చెప్పిన ప‌వ‌న్ తాజాగా యాత్ర‌లో పుస్త‌కాలు మోసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇపుడు దీక్షంటూ కాలి మీద కాలేసుకుని ప‌చ్చ‌టి గడ్డిలో ప‌వ‌న్ పుస్త‌కాలు చ‌దువుతుంటే... అదేదో సినిమా షూటింగ్ జ‌రుగుతున్న బిల్డ‌ప్ త‌ప్పించి ఏ కోశానా ప్ర‌జా పోరాటంలా లేద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.