Begin typing your search above and press return to search.

ఈ జంపింగ్‌ జపాంగులతో ఉపయోగం ఉంటుందా పవన్‌?

By:  Tupaki Desk   |   13 March 2023 3:00 PM GMT
ఈ జంపింగ్‌ జపాంగులతో ఉపయోగం ఉంటుందా పవన్‌?
X
ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లో చేరికలు షురూ అయ్యాయి. టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరితే.. వైసీపీలో టీడీపీ నేత జయమంగళ వెంకటరమణ చేరారు. ఇక తాజాగా జనసేన పార్టీలోకి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈదర హరిబాబు చేరిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో సీట్లు దక్కవనుకునేవారు మాత్రమే జనసేనలో చేరుతున్నారని టాక్‌ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం అధికార వైసీపీలో ఉండి ఇప్పటివరకు ఏ పదవి పొందలేకపోయినవారు మాత్రమే వేరే పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటివారందరికీ మొదటి ప్రాధాన్యతగా జనసేన పార్టీ నిలుస్తోందని అంటున్నారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే జనసేన తరఫున ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కించుకోవచ్చనే యోచనలో ఈ నేతలు ఉన్నారని పేర్కొంటున్నారు.

ఇటీవల బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. వాస్తవానికి ఆయన జనసేనలో చేరాల్సి ఉందని అంటున్నారు. అయితే ఆయన బీజేపీ నేత కావడం, ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుండటంతో పవన్‌ కొంచెం తటపటాయించడంతో కన్నా టీడీపీలో చేరారని చెబుతున్నారు.

ఇక కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో అక్కడి నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 2014, 2019ల్లో ఆయనకు టీడీపీ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా సీటు దక్కలేదు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తానేటి వనితను గెలిపిస్తే కీలక పదవి ఇస్తామని జగన్‌.. టీవీ రామారావుకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి దక్కపోవడంతోనే జనసేన పార్టీలో చేరారు.

అలాగే ఈదర హరిబాబు 1994లో టీడీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో సీటు రాలేదు. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా పనిచేశారు. 2019లో మళ్లీ ఈదర హరిబాబుకు సీటు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇలా అన్ని పార్టీలు మారివచ్చిన వారి ద్వారా పవన్‌ కల్యాణ్‌ కు ఏం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరిపోయారు. గతంలో ఆయన కాంగ్రెస్‌ లో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ లో సీటు ఇవ్వకపోవడంతో జనసేనలో చేరి 2019లో రాజోలు నుంచి గెలుపొందారు. మళ్లీ కొద్ది కాలానికే వైసీపీతో అంటకాగుతున్నారు. ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో రాపాక పోటీ చేయనున్నారు.

ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు వంటి వారు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గెలుపొందుతారని అనుకున్నా పార్టీని అంటిపెట్టుకుని నిబద్ధతతో ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ జంపింగ్‌ జపాంగుల వల్ల పవన్‌ కు ప్రయోజనం ఉండదనే మాటే అంతటా వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.