Begin typing your search above and press return to search.

పొత్తులపై పవన్ తాజా మాట విన్నారా?

By:  Tupaki Desk   |   21 Jun 2023 11:10 AM GMT
పొత్తులపై పవన్ తాజా మాట విన్నారా?
X
వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలిపోకూడదంటూ పొత్తులకు తెర తీసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ దిశగా ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. ప్రతి సందర్భంలోనూ ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కొత్త ఆర్థాలకు కారణమవుతుంటాయి. అదే సమయంలో.. రాజకీయంగా కూడా కొత్త అలజడిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ కల్యాణ్.. పొత్తులకు సంబంధించిన తనకు ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర రీతిలో వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే.. పొత్తుల విషయంలో తాను మాత్రమే చొరవ చూపకూడదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేయటం కనిపిస్తుంది. ''వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ.. జనసేన.. బీజేపీలు కలవాలి. అది ఏ స్థాయిలో ఎలా అనేది నేనొక్కడినే ప్రతిపాదించేది కాదు. అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం రావాలి. ఎన్నికలు దగ్గరపడ్డాక పొత్తులపై మరింత స్పష్టత వస్తుంది' అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదన్నదే తన ఉద్దేశంగా పేర్కొన్ానరు. అయితే.. ఏకాభిప్రాయం కుదరటం కొంత కష్టసాధ్యమైన విషయమని.. తన సైడ్ నుంచి తాను చెప్పేశానని చెప్పారు. చంద్రబాబును మూడుసార్లు కలిశానని.. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు.

పవన్ మాటల్ని చూస్తే.. పొత్తుల మీద తాను మాత్రమే కాదు.. మిగిలిన భాగస్వామ్య పార్టీల నుంచి కూడా తాను కోరుకుంటున్న స్పందన కోసం ఎదురుచూస్తున్న విషయం అర్థమవుతుంది. పొత్తులపై ఇప్పటివరకు పవన్ కల్యాణ్ పలుమార్లు మాట్లాడటం.. ఆ సందర్భంగా పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు అన్న దగ్గర.. టీడీపీ సానుభూతిపరుల నుంచి వచ్చే వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బంది పెట్టేలా ఉన్నట్లు చెబుతున్నారు.

దీనికి తోడు పొత్తుల విషయంపై తాను పదే పదే ప్రస్తావించటం ద్వారా.. బేరమాడే శక్తిని కోల్పోతారన్న కొత్త వాదన తెర మీదకు వచ్చింది. అందుకే.. పొత్తులపై తొందరపాటుతనాన్ని ప్రదర్శించకుండా ఉండటమే మేలన్న భావనలో పవన్ ఉన్నారా? అన్న భావన కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

పొత్తులను డిసైడ్ చేసేది తాను ఒక్కడినే కాదన్న ఆయన.. పొత్తుల విషయంలో స్టేక్ హోల్డర్స్ మధ్య జరగాల్సిన చర్చ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తే.. పొత్తులపై దూకుడు ప్రదర్శించాలన్న ఆలోచన పవన్ లో లేదన్న భావన వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.