Begin typing your search above and press return to search.

పవన్ ఫ్లెక్సీని కిందేసి తమ్ముళ్లు తొక్కేశారంట

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:53 AM GMT
ఏపీలో ఎక్కడా లేనంత ఫ్లెక్సీల గోల గోదావరి జిల్లాలో ఉంటుంది. ఆ మధ్యన టాలీవుడ్ నటుల ఫ్లెక్సీల వివాదం.. శాంతిభద్రతల సమస్యగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఫ్లెక్సీ వివాదమే ఒకటి చోటు చేసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్లెక్సీని ఆయన అభిమానులు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.

ఇంతవరకూ వ్యవహారం సాఫీగానే సాగినా.. ఇక్కడే అనుకోని పరిణామం చోటు చేసుకుంది. పవర్ స్టార్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రోడ్డుకు అడ్డంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు దాన్ని తొలగించటంతో వివాదం రాజుకుంది. ఇది కాస్తా గంటల వ్యవధిలో పెద్ద రచ్చగా మారింది. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని తొలగించటమే కాదు.. కింద పడేసి తొక్కినట్లుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ.. దీనికి కారణమైన తమ్ముళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు ప్రతిగా టీడీపీ నేతల నేతృత్వంలో కొందరు కార్యకర్తలు ప్రతి నినాదాలు చేయటం మొదలెట్టారు. తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని.. ఇందుకు బాధ్యులైన పవన్ అభిమానులపై కేసులు పెట్టాలంటూ టీడీపీ తమ్ముళ్లు ఆందోళన చేయటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసుల చొరవతో.. ఇరు వర్గాలకు సర్ది చెప్పి గురువారం అర్థరాత్రి తర్వాత పంపినట్లుగా చెబుతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఫ్లెక్సీ వివాదం ఏ రోజుకైనా ఇబ్బందేనన్న మాట వినిపిస్తోంది.