Begin typing your search above and press return to search.

జగన్ దమ్ముకు పరీక్ష పెట్టిన పత్తిపాటి.. రానున్న రోజుల్లో ఇంకెన్నో?

By:  Tupaki Desk   |   3 March 2023 5:09 PM GMT
జగన్ దమ్ముకు పరీక్ష పెట్టిన పత్తిపాటి.. రానున్న రోజుల్లో ఇంకెన్నో?
X
కదిలించి తిట్టించుకునే అలవాటు కొందరికి ఉంటుంది. ఇలాంటి తీరుకు కొనసాగింపు అన్నట్లుగా తమకు సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ.. తమ రాజకీయ ప్రత్యర్థులకు సవాళ్లు విసిరే కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఘనత ఏపీ అధికారపక్షానిదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తరచూ ఒకేలాంటి సవాలును విసురుతుంటారు. అదేమంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు వేర్వేరుగా ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు అడుగుతారంటే.. ఇద్దరు కలిస్తే.. తమకు జరిగే నష్టాన్ని అంచనా వేసి.. ఆ ఇద్దరు కలవకుండా ఉండేందుకు అవసరమైన మసాలా మొత్తాన్ని నూరేసి.. దమ్ముందా? అన్న మాటలతో సవాలు విసురుతుండటం ఈ మధ్యన ఎక్కువైంది.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా ఇప్పుడు విపక్ష నేతలు కూడా ముఖ్యమంత్రికి దమ్ముందా? అంటూ కొత్త కొత్త పాయింట్లను తెర మీదకు తీసుకొస్తున్నారు. అందులో ముఖ్యమైంది.. సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినా.. ఆయన ఆ ప్రాంతానికి చేరటానికి ముందే మొత్తం సీల్ చేసేయటం.. కర్ఫ్యూ వాతావరణం అన్నట్లుగా.. షాపులు మొదలుకొని.. స్కూళ్లు.. జనజీవనాన్ని నిలిపేయటం కనిపిస్తుంటుంది. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే.. ఇలాంటివేమీ చేయకుండా మామూలుగా వెళ్లొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇది సరిపోదన్నట్లుగా తక్కువ దూరానికి సైతం రోడ్లమీద ప్రయాణించే కన్నా.. హెలికాఫ్టర్ ను వినియోగించే తీరును కూడా ప్రశ్నిస్తున్నారు. రోడ్ల మీద ప్రయాణించే దమ్ము జగన్ కు లేదా? అని అడుగుతున్నారు. జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి.. ప్రతిరోజు తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజల్ని నేరుగా కలిసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఇవన్ని సరిపోవన్నట్లుగా తాజాగా టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పత్తిపాటి కొత్త సవాళ్లను తెర మీదకు తీసుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడే ముఖ్యమంత్రి జగన్.. ఆయనకు నిజంగానే దమ్ముంటే.. 151 ఎమ్మల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ పొత్తుపై దమ్ముందా? అని ప్రశ్నించే జగన్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతం ఇచ్చే దమ్ముందా? అని సవాలు విసిరారు. వైసీపీకి నింజగానే దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలకు వస్తుందా? అని సవాలు విసిరారు.

మరి.. తరచూ దమ్ముందా? అని ప్రశ్నించే ముఖ్యమంత్రి జగన్.. మాజీ మంత్రి పత్తిపాటి విసిరిన సవాళ్లకు సమాధానం చెబుతారా? మిగిలినవన్నీ పక్కన పెట్టి.. 151 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తానని ప్రకటించే దమ్ముందా? అంటూ విసిరిన సవాలుకు సీఎం జగన్ స్పందిస్తారంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.