Begin typing your search above and press return to search.

‘బడా’ కంపెనీల ప్రకటనలన్నీ బడాయే

By:  Tupaki Desk   |   5 July 2016 10:30 AM GMT
‘బడా’ కంపెనీల ప్రకటనలన్నీ బడాయే
X
ఆ క్రీం రాసుకుంటే చాలు ముఖం మీద మచ్చలన్నీ మాయం కావటమే కాదు.. హీరోయిన్ అంత అందంతో మెరిపోతారు. మా టూత్ పేస్ట్ వాడితే చాలు పళ్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదన్నట్లుగా చెప్పే మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టేసింది అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తాజాగా వివిధ కంపెనీలకు చెందిన ప్రకటనల మీద వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన కౌన్సిల్ వారి ప్రకటనల్లోని బడాయిని తప్పు పట్టటమే కాదు.. వారిని వివరణ కోరుతూ మొట్టికాయలు వేసింది. ఇలా మొట్టికాయలు తిన్న వారిని చూస్తే..

మొనగాడులాంటి విదేశీ కంపెనీలకు సైతం వణుకు పుట్టించేలా యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఉత్పత్తులపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనదైన శైలిలో మార్కెటింగ్ చేస్తూ.. ప్రచారం చేసే ఆయన ఉత్పతులకు సంబంధించిన ప్రకటనలపై పలు ఆరోపణలు వచ్చాయి. వీటిని పరిశీలించిన కౌన్సిల్.. పతంజలి ఉత్పత్తులు ప్రకటనల్లో చెబుతున్నంత ప్రభావవంతంగా పని చేయటం లేదన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా జరిపిన విచారణలో పతంజలి ఉత్పత్తులు కొన్ని ప్రకటనల్లో చెప్పినంత ప్రభావవంతంగా పని చేయటం లేదని తేల్చి వివరణ కోరారు.

పతంజలి ఉత్పత్తుల్లో ప్రముఖమైన దంతకాంతి టూత్ పేస్ట్ ప్రకటనలో చెప్పినట్లుగా దంతస్రావం.. వాపు.. చిగురుల బ్లీడింగ్.. పళ్లు పసుపు రంగులోకి మారటం.. సెన్సిటివ్.. చెడు వాసనలకు చెక్ చెబుతుందంటూ చెబుతున్న మాటల్లో నిజం లేదని.. తన ప్రకటన ద్వారా పతంజలి కంపెనీ మోసానికి పాల్పడుతుందని తేల్చారు. దంతకాంతి దారిలోనే.. పతంజలికి చెందిన మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె.. పండ్ల రసాలు.. పశువుల దాణా లాంటి ప్రకటనల్లోనూ డాబే ఎక్కువగా ఉందని తేల్చారు.

నిజానికి పతంజలి ఉత్పత్తుల్లోనే కాదు.. హెచ్ యూఎల్.. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్.. కెల్లాగ్ ఇండియా.. లోరియాల్.. కాల్గేట్ పామోలివ్ లాంటి కంపెనీలు చెప్పే మాటలన్ని ఉత్త మాటలేనని.. ప్రకటనల్లో చూపించినంత పస వాటి చేతల్లో లేదని తేల్చింది. సో.. ప్రకటనల్ని చూసి ఫీల్ అయితే.. అడ్డంగా బుక్ కావటం ఖాయమన్న విషయం మరోసారి తేలిపోయినట్లే.