Begin typing your search above and press return to search.

టీడీపీకి డబుల్ షాక్..ఆ రెండు జిల్లాల్లో ఇక కష్టమే!

By:  Tupaki Desk   |   30 Aug 2019 1:30 AM GMT
టీడీపీకి డబుల్ షాక్..ఆ రెండు జిల్లాల్లో ఇక కష్టమే!
X
ఏపీలో తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నయి. ఓటమి నుంచి పార్టీ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హీన స్థితిలో అతి తక్కువ సీట్లకు పరిమితమవడానికి కారణాలేమిటో కూడా తెలియడం లేదన్న మాటలు సాక్షాత్తు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి నుంచే వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా పార్టీకి మంచి పట్టున్న విశాఖ - తూర్పు గోదావరి జిల్లాల్లో ఇద్దరు కీలక నేతలు పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయిపోయారు.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వరుపుల రాజా గురువారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే విశాఖ జిల్లాలో పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో మంచి పట్టున్న అడారి తులసీరావు తనయుడు - మొన్నటి ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన అడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరుతున్నట్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అటు తూర్పు గోదావరి జిల్లాలో వరుపుల రాజా - ఇటు విశాఖ జిల్లాలో అడారి ఆనంద్ కుమార్ లు పార్టీకి దూరమైతే.. ఆ రెండు జిల్లాల్లో టీడీపీకి గట్టి దెబ్బేనని చెప్పక తప్పదు.

వరుపుల రాజా విషయానికి వస్తే... యువనేతగా - కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా రాజాకు మంచి పేరే ఉంది. సీనియర్ నేత వరుపుల సుబ్బారావు మనవడిగా రాజా.. ప్రత్తిపాడులో తనదైన శైలిలో పట్టు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం దాకా టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ నాన్చుడు ధోరణి అవలంబించి చివరి నిమిషంలో రాజాకు సీటు కేటాయించింది. అయినా కూడా రాజా కేవలం 4 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. సకాలంలో టికెట్ కేటాయించి ఉంటే తాను గెలిచేవాడినేనని రాజా వాదన. ఇప్పుడు అదే వాదనను వినిపించడంతో పాటుగా కాపులకు టీడీపీ తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో వైసీపీపై ప్రశంసలు కురిపించిన రాజా... కాపుల విషయంలో సీఎం జగన్ ఓకే వైఖరితో ముందుకు సాగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి రాజీనామా చేసిన రాజా... త్వరలోనే వైసీపీలో చేరిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.

ఇక అడారి ఆనంద్ కుమార్ విషయానికి వస్తే... రాష్ట్రంలోనే ఓ పెద్ద డెయిరీగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న విశాఖ డెయిరీ అడారి కుటుంబానికి చెందనదనే భావన తెలిసిందే కదా. విశాఖ జిల్లాలోని రైతుల్లో డెయిరీ పట్ల - అడారి ఫ్యామిలీ పట్ల మంచి అభిప్రాయం ఉంది. అడారి తులసీరావు చేతుల మీదుగా ప్రారంభమైన విశాఖ డెయిరీ తనదైన శైలిలో సత్తా చాటుతోంది. డెయిరీ ద్వారా అడారి ఫ్యామిలీకి జిల్లా వ్యాప్తంగా మంచి పేరే ఉంది. అడారి ఫ్యామిలీ నుంచి ఒక్క ప్రకటన వస్తే... రైతులంతా అదే మాటకు కట్టుబడే అవకాశాలు లేకపోలేదు. అడారి తులసీరావు వయోభారం నేపథ్యంలో రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్నా... ఆయన మనవడిగా - డెయిరీ వ్యవహారాల్లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న అడారి ఆనంద్ కుమార్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం నేపథ్యంలో ఆయన ఓటమిపాలయ్యారు. తాజాగా అధికారం చేపట్టిన వైసీపీ... విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విశాఖ డెయిరీ రైతులపై దృష్టి సారించగా... అడారి ఆనంద్ కుమార్ వైసీపీలోకి చేరిపోయేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ దిశగా ఆయన నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇలా తూర్పు గోదావరి జిల్లా నుంచి వరుపుల రాజా - విశాఖ జిల్లా నుంచి అడారి ఆనంద్ కుమార్ లు టీడీపీని వీడి వైసీపీలో చేరితే... ఆ రెండు జిల్లాల్లో టీడీపీకి భారీ దెబ్బ తప్పదన్న వాదన వినిపిస్తోంది.