Begin typing your search above and press return to search.

జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఎంపీలందరూ కొవిడ్ టెస్ట్ చేపించుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   22 Jan 2021 5:03 AM GMT
జనవరి 29 నుంచి పార్లమెంట్  బడ్జెట్ సమావేశాలు..ఎంపీలందరూ కొవిడ్ టెస్ట్ చేపించుకోవాల్సిందే!
X
జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అని , లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు జరుగుతాయని వివరించారు. వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, జీరో అవర్ తో పాటు సభలో సాధారణ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే, బడ్జెట్ అంతా డిజిటల్ విధానంలోనే వుంటాయని తెలిపారు. అంతేకాకుండా, పార్లమెంటు ఆవరణలోని అన్ని క్యాంటీన్లలో ఇకపై ఆహార పదార్థాలపై రాయితీని తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.

గత సెప్టెంబరులో జరిగినట్టే లోక్ సభ, రాజ్యసభ చాంబర్లలో సమావేశాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగం కోసమే పార్లమెంటు సెంట్రల్ హాల్‌ ను వినియోగిస్తామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఇక ఈ సమావేశాలకి వచ్చే ఎంపీలు అందరూ కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఎంపీల పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇందు కోసం ఈనెల 27,28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓంబిర్లా పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.