Begin typing your search above and press return to search.

ఢిల్లీ కెప్టెన్‌ గా పంత్ ... ఆ ముగ్గురికి నిరాశే !

By:  Tupaki Desk   |   31 March 2021 8:40 AM GMT
ఢిల్లీ కెప్టెన్‌ గా పంత్ ... ఆ ముగ్గురికి నిరాశే !
X
ఐపీఎల్ 2021 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా రిషబ్ పంత్ ను నియమించినట్లు ప్రకటించింది. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్‌ అయిన శ్రేయాస్ అయ్యర్ , ఇటీవల ఇంగ్లాండ్‌ తో వన్డే సిరీస్ ఆడుతూ గాయపడ్డాడు. బంతిని నిలువరించే క్రమంలో బౌండరీ లైన్ వద్ద శ్రేయాస్ అయ్యర్ డైవ్ చేయగా. శరీరం బరువు మొత్తం అతని ఎడమచేతి భుజంపై పడిపోయింది. దాంతో శ్రేయాస్ భుజం స్థానభ్రంశమైంది. ఏప్రిల్‌లో గాయానికి సర్జరీ చేయించుకోనున్న శ్రేయాస్ అయ్యర్ కనీసం 4-5 నెలలు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు. గాయం కారణంగా.. అయ్యర్ ఆగస్టులో వెళ్లాల్సిన ఇంగ్లండ్‌ పర్యటనకు, సెప్టెంబర్‌లో స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్‌, సౌత్ఆఫ్రికా టీ20 సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.

దీనితో ఐపీఎల్‌లో కెప్టెన్సీ ఛాన్స్ పంత్ ‌కి అవకాశం వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ గాయపడి.. ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరమవగానే.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా.. ఢిల్లీ టీమ్ ‌లో ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, గతంలో పంజాబ్ టీమ్ ‌కి కెప్టెన్‌ గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ ‌కి కెప్టెన్‌ గా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్ రేసులో నిలిచారు. కానీ ,ఆ ముగ్గురిని కాదని యువ ఆటగాడు రిషబ్ పంత్ ‌‌ని ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్ ‌గా నియమించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో మూడు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ టీమ్ కెప్టెన్‌ గా తనని నియమించడంపై రిషబ్ పంత్ స్పందించాడు. ఢిల్లీ టీమ్‌తోనే నా ఐపీఎల్ జర్నీ ప్రారంభమైంది. ఈ జట్టులోనే నేను క్రికెటర్‌ గా ఎదిగాను. ఎప్పటికైనా కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించాలనేది నా కల. ఇప్పుడు అది నెరవేరబోతోంది. ఈ కెప్టెన్సీని ఓ గౌరవంగా భావిస్తున్నాను అని రిషబ్ పంత్ వెల్లడించాడు.