Begin typing your search above and press return to search.

డేరా విద్రోహం టేపులు బ‌య‌ట‌కొచ్చాయ్‌

By:  Tupaki Desk   |   27 Aug 2017 9:16 AM GMT
డేరా విద్రోహం టేపులు బ‌య‌ట‌కొచ్చాయ్‌
X
డేరా బాబా దుర్మార్గానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. త‌న ఆశ్ర‌మంలోని ఇద్ద‌రు యువ‌తుల్ని అత్యాచారం చేసిన నేరారోప‌ణ నిరూపిత‌మై దోషిగాగుర్మీత్ రాం ర‌హీం సింగ్ తేల్చింది సీబీఐ న్యాయ‌స్థానం. త‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే ఏం చేయాల‌న్న అంశంపై గుర్మీత్ దారుణ‌మైన ప్లాన్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌చ్చేలా కొన్ని ఆధారాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

గుర్మీత్‌ కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించ‌టానికి వీలుగా ప‌క్కా ప్లాన్ వేసుకొనే కోర్టు వ‌ద్ద‌కు చేరుకున్నార‌న్న విష‌యం తాజాగా వెలుగు చూసింది. డేరా బాబాను దోషిగా తేలుస్తూ పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసిన వెంట‌నే పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు వీలుగా కుట్ర చేసిన తీరుకు సంబంధి కొన్ని సంభాష‌ణ‌ల టేపులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

విధ్వంసం సంద‌ర్భంగా బాబా పేరును ప్ర‌స్తావించ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. తాను చెప్పిన విష‌యాల్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తితో జ‌రిపిన సంభాష‌ణ‌లో ఉంది. ఈ టేపుల్లో ఒక వ్య‌క్తి మ‌నం దాడులు చేయాలా? వ‌ద్దా? అని రెండో వ్య‌క్తిని ప్ర‌శ్నించ‌గా అందుకు మొద‌టి వ్య‌క్తి స్పందిస్తూ..నువ్వు దాడి చేసి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టంగా చెప్పటం ఉంది. ఒక‌వేళ ఎవ‌రైనా మీడియా ప్ర‌తినిధి చూసి అడిగితే మాత్రం.. త‌నంత‌ట తానే వ‌చ్చాన‌ని చెప్పాల‌ని కూడా చెప్ప‌టం ఆ ఫోన్ సంబాష‌ణ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

అంతేకాదు విధ్వంసంలో పాల్గొనే పిల్ల‌లు సైతం.. తాము సొంతంగానే వ‌చ్చిన‌ట్లుగా వారి త‌ల్లిదండ్రులు చెప్పాలంటూ స‌ద‌రు వ్య‌క్తి చెప్ప‌టం అందులో వినిపిస్తోంది. కోర్టు తీర్పు చెప్పే వేళ‌లో కోర్టు వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున మ‌హిళ‌లు.. పిల్ల‌లు ఉండ‌టం చూస్తే.. విధ్వంసం వెనుక ప‌క్కా ప్లాన్ ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతేకాదు.. గుర్మిత్ పై తీర్పు చెప్ప‌టానికి మూడు రోజుల ముందు నుంచే పంచ‌కుల చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి వంద‌లాది మందిని స‌మీకరించేలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని.. అందుకు సంబంధించిన ఒక ఆడియో కూడా పోలీసుల‌కు ల‌భించిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు టేపులో.. అన్ని వ‌స్తువుల్ని దాచి ఉంచాల‌ని.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే వినియోగించాల‌న్న‌ది సారాంశంగా చెబుతున్నారు. అరెస్ట్‌ ను ముందే ఊహించి.. భారీ విధ్వంసం దిశ‌గా ప‌క్కా ప్ర‌ణాళిక‌ను డేరా బాబా అనుచ‌రులు సిద్ధం చేసిన‌ట్లుగా చెప్పక త‌ప్ప‌దు.