Begin typing your search above and press return to search.

పంచాయితీ ఎన్నికల్లో గుర్తులు కేటాయించి.. తర్వాత వెనక్కి తీసుకున్నారే

By:  Tupaki Desk   |   9 Feb 2021 5:30 AM GMT
పంచాయితీ ఎన్నికల్లో గుర్తులు కేటాయించి.. తర్వాత వెనక్కి తీసుకున్నారే
X
ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా ఉంది. ఎన్నికల వేళ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు.. ఇంత ఉదాసీనంగా పని చేయటమా? అని మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలంలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది.

షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వేళలో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా.. వారికి కేటాయించిన ఎన్నికల గుర్తును ప్రకటించారు మండల విద్యా కేంద్ర అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే సీన్ రివర్సు అయ్యింది. ఏమైందో ఏమో కానీ.. కాసేపటికే తాము కేటాయించిన గుర్తుల్ని అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అధికారులు మాట తప్పిస్తుండటం గమనార్హం.

మొదట ప్రకటించిన ఎన్నికల గుర్తులకు భిన్నంగా.. కాసేపటికి తెల్ల పేపర్ను అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై అంటించి వేశారు.దీంతో.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో గందరగోళం చోటు చేసుకుంది. మళ్లీ గుర్తుల్ని కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏమైంది? ఎందుకిలా? జరిగిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు.

ఇదిలా ఉంటే.. తమ చుట్టుపక్కల ఉన్న పంచాయితీలకు అభ్యర్థులకు గుర్తుల్ని కేటాయించిన అధికారులు.. తమ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహస్తున్న అధికారులపై బరిలో నిలిచిన అభ్యర్థులు గరంగరంగా ఉన్నారు. ఈ ఉదంతంపై అధికారులు మాత్రం స్పందించేందుకు సుముఖంగా ఉండకపోవటం గమనార్హం.