Begin typing your search above and press return to search.

ఏకగ్రీవాలకు చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు ?

By:  Tupaki Desk   |   28 Jan 2021 11:30 AM GMT
ఏకగ్రీవాలకు చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు ?
X
చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. తాను అధికారంలో ఉంటే ఒకలాగ వ్యవహరించిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి పూర్తి విరుద్దంగా మాట్లాడుతున్నారు. పంచాయితి ఎన్నికల విషయమే తీసుకుంటే ఏకగ్రీవాలైన పంచాయితీలకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వటం ఎప్పటి నుండో వస్తున్నదే. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

అయితే ఈ పద్దతిని చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవాల జపం చేస్తోందంటూ మండిపోతున్నారు. నిజానికి ఎన్నికలు జరిగితే గొడవలు జరిగే అవకాశాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామాల్లో గొడవలను జరగకుండా చూడటంలో భాగంగానే ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తాయన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నపుడు కూడా చంద్రబాబు ఇదే పద్దతిని అవలంభించారు.

ఇక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటాయన్న విషయమూ కొత్తేమీకాదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల కోటాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికలను కూడా అప్పట్లో టీడీపీనే గెలుచుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి తనకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇపుడు ఏకగ్రీవాలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు ?

ఎందుకంటే ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్న విషయం తెలిసిందే. తన మాట నిజమని నిరూపించుకోవాలంటే స్ధానికసంస్ధల ఎన్నికలు ఏకగ్రీవాలు కాకుండా పోలింగ్ జరగాల్సిందే. అందుకనే చంద్రబాబు ఇంతలా ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే ప్రజలు ఎవరికి ఓట్లేయదలచుకుంటే ఆ పార్టీకే ఓట్లేస్తారు. అంతేకానీ చంద్రబాబు మాటను నిజం చేయటంకోసం వైసీపీకి వ్యతిరేకంగానో లేకపోతే టీడీపీకి అనుకూలంగానో ఓట్లేయరు.

చట్టాలను గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే ప్రజల ఆదరణ ఉంటుందని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారు. మరి ఇదే మాట తాను అధికారంలో ఉన్నపుడు ఏనాడూ చంద్రబాబుకు గుర్తుకురాలేదు. తాను అధికారంలో ఉన్నపుడు కలక్షన్ కమీషన్ బదిలీచేసిన ఉన్నతాధికారుల విషయంలో అప్పటి కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేదితో ఎంత గొడవపడ్డాడో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే చంద్రబాబు చట్టం, రాజ్యాంగం, విలువలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. చూద్దాం జనాలు ఏమి తీర్పు చెబుతారో.