Begin typing your search above and press return to search.

పాకిస్థానీ వీడియో వైరల్‌: అల్లా.. మాకు మోదీ లాంటి వ్యక్తి కావాలి!

By:  Tupaki Desk   |   23 Feb 2023 6:32 PM GMT
పాకిస్థానీ వీడియో వైరల్‌: అల్లా.. మాకు మోదీ లాంటి వ్యక్తి కావాలి!
X
భారత్‌ దాయాది దేశం.. పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న సంగతి తెలిసిందే. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఆ దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నిత్యావసర ధరలు.. గోధుమలు, పామాయిల్, పాలు, గుడ్లు, మాంసం, పెట్రోలు తదితరాలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

దీంతో పాకిస్థాన్‌ విదేశీ సహాయం కోసం అర్రులు చాస్తోంది. ఎక్కే గడప.. దిగే గడప అన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి అన్ని దేశాల్లో పర్యటిస్తూ ఆ దేశాల సహాయాన్ని అర్థిస్తున్నారు. ముందు ఆ దేశానికి సహాయం చేయడానికి నిరాకరించిన పాకిస్థాన్‌ మిత్ర దేశం చైనా ఎట్టకేలకు కాస్త రుణ సహాయం చేసింది.

మరోవైపు పాకిస్థాన్‌ ప్రజలు తమ దాయాది దేశమైన భారత్‌ తో తమ దేశ పరిస్థితిని పోల్చుకుంటున్నారు. తమకు ప్రధాని నరేంద్ర మోదీలాంటి వ్యక్తి ఉంటే తమను కష్టాలబారి నుంచి బయటపడేసేవారని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, పాకిస్థాన్‌ లో ఆయన నాయకత్వాన్ని కోరుతూ పాకిస్థానీ వ్యక్తి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో వ్యక్తి ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరుచుకుపడ్డాడు. దేశ విభజనపై ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ భారతదేశంలో భాగంగా ఉండి ఉంటే తమకిప్పుడు ఇలాంటి కష్టాలు వచ్చేవి కావని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దేశం విడిపోకుండా ఉంటే అన్ని వస్తువులు సరసమైన ధరలకే లభించేవని పేర్కొన్నాడు. అలాగే ప్రతి రాత్రి తమ పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని కూడా అందించగలిగేవారమన్నాడు.

దేశాన్ని చక్కదిద్దేందుకు, సమస్యలకు కారణమయ్యే దుష్టశక్తులను ఎదుర్కోవడానికి మోదీ లాంటి వ్యక్తి పాకిస్థాన్‌ కు ఉండాలని కోరుకుంటున్నానని వీడియోలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. మోదీ నాయకత్వానికి, ప్రజలు ఆయనను గౌరవిస్తున్న, అనుసరిస్తున్న తీరు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. మోదీ పాకిస్థాన్‌ ను పాలిస్తే, ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లా పాకిస్థాన్‌ అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి వీడియోలో అభిప్రాయపడ్డాడు. భారత్‌లో టమోటాలు, చికెన్‌ సరసమైన ధరలకే లభిస్తున్నాయని ఆ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఇతర వస్తువుల ధరలు అందుబాటులోనే ఉన్నాయన్నాడు.

ఇప్పుడు ఈ వీడియో ఇండియా, పాకిస్తాన్‌ రెండింటిలోనూ వైరల్‌ అవుతోంది. చాలా మంది ఆ వ్యక్తి అభిప్రాయాలను మెచ్చుకున్నారు. మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు, మరికొందరు ప్రత్యర్థి దేశ ప్రధానిని పొగడటాన్ని ఖండించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.