Begin typing your search above and press return to search.

చక్కెరొస్తే మందూ లేదు.. పాక్ లో రోగులకు కష్టాలే

By:  Tupaki Desk   |   26 Feb 2023 5:32 PM GMT
చక్కెరొస్తే మందూ లేదు.. పాక్ లో రోగులకు కష్టాలే
X
పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతోంది. పెట్రోల్ మంట.. నిత్యవసర సరుకుల ధరల అగ్గి.. కరెంటు కోతలు.. ఇప్పుడు ఆస్పత్రుల్లో ఔషధాలూ లేవంట. ఆస్పత్రుల్లో అవసరమైన ఔషధాల్లేక శస్త్రచికిత్సలు సైతం నిలిచినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పాక్ లో ఆర్థిక సంక్షోభం అంతకంతా ముదురుతోంది. పరిస్థితులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇది వైద్య వ్యవస్థను కుప్పకూలేలా చేస్తోంది.

విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో అత్యవసర ఔషధాలు/ దేశంలో ఉత్పతి చేసే ఇతర మందుల ముడి సరకును సైతం దిగుమతి చేసేకోలేని దైన్యం నెలకొంది. చేసేదేం లేక కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఆస్పత్రుల్లోని రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సల్ని నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది.

పెద్ద రోగాలకూ కరువే

శరీరంలో ముఖ్యమైన అవయవాలు గుండె. కిడ్నీలు. వీటి సహా కొన్ని సున్నితమైన శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్‌ థియేటర్లలో వినియోగించే మత్తు సంబంధిత ఔషధాల నిల్వలు రెండు వారాల కన్నా తక్కువే ఉన్నాయి. క్యాన్సర్‌ మందులదీ ఇదే దారి. దీంతో దిగుమతుల కోసం వాణిజ్య బ్యాంకులు కొత్తగా లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను జారీ చేయడంలేదని ఔషధ తయారీదారులు వాపోతున్నారు.

వారికి మందు మనదే..

పాకిస్థాన్ లో ఔషధాల తయారీ ముడి పదార్థాలకు దాదాపు 95శాతం భారత్, చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ల కొరత కారణంగా చాలావరకు ఔషధ తయారీదారులకు దిగుమతి చేసుకున్న ముడిసరకు కరాచీ నౌకాశ్రయంలోనే నిలిచిపోయింది. దీనికితోడు ఉత్పత్తి వ్యయం స్థిరంగా పెరుగుతూ పోతోంది.

ఇంధన ధరలు పెరగడం, రవాణా ఛార్జీలు, పాక్‌ రూపాయి విలువ క్షీణించడం దీనికి కారణాలు. దీంతో పరిస్థితులు విపత్తుగా మారకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ పాక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (పీఎంఏ) విజ్ఞప్తి చేసింది. అయితే, తక్షణ చర్యలు తీసుకోవడానికి బదులు అధికారులు అసలు ఔషధాల కొరత ఎంత ఉందనే అంశాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి దొరకడమే లేదంట..

ముఖ్యమైన ఔషధాలైన పాన్‌డోల్‌, ఇన్సులిన్, బ్రూఫెన్, డిస్ప్రిన్, కాల్పోల్, టెగ్రల్, నిమెసులైడ్, హెపామెర్జ్, బస్కోపాన్, రివోట్రిల్ తదితరాలు పాకిస్థాన్ లో అందుబాటులో లేవు. ఇవన్నీ చాలావరకు రోజువారీగా వాడేవే కావడం గమనార్హం. దీనిపై పంజాబ్‌ ఔషధ వ్యాపారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సర్వే బృందాలు కీలకమైన ఔషధాల కొరతను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేశాయన్నారు. కొన్ని ఔషధాల కొరత సాధారణమే అయినప్పటికీ.. అత్యవసరమైనవి అందుబాటులో లేకపోవడం మాత్రం ఎక్కువమంది వినియోగదారులపై ప్రభావితం చూపుతోందన్నారు.     


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.