Begin typing your search above and press return to search.

క్వాలిఫయర్ 1-2 ఎవరో తేలింది.. హైదరాబాద్ లో లంక, నెదర్లాండ్స్ తో పాక్ మ్యాచ్ లు

By:  Tupaki Desk   |   10 July 2023 12:23 PM GMT
క్వాలిఫయర్ 1-2 ఎవరో తేలింది.. హైదరాబాద్ లో లంక, నెదర్లాండ్స్ తో పాక్ మ్యాచ్ లు
X
వన్డే ప్రపంచ కప్ నకు మరెంతో సమయం లేదు. మూడు నెలల్లోపే సమర భేరి మోగనుంది. భారత్ తొలిసారి పొరుగు దేశాలతో సంబంధం లేకుండా ఆతిథ్యం ఇస్తున్న కప్ కావడం ఈ సారి ప్రత్యేకత. 2019లోలాగే ఇప్పుడు కూడా 10 జట్లతో లీగ్ పద్ధతిన మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇందులో టాప్-4 జట్లు సెమీస్ కు చేరతాయి. గత ప్రపంచ కప్ లో భారత్-న్యూజిలాండ్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తలపడిన సంగతి తెలిసిందే.

నాడు వారు.. నేడు వీరు

గత ప్రపంచ కప్ నకు వెస్టిండీస్ , అఫ్గానిస్థాన్ క్వాలిఫయర్ దశ నుంచి అర్హత సాధించాయి. ఈసారి మాత్రం అఫ్గానిస్థాన్ నేరుగా వచ్చింది. వెస్టిండీస్ అనూహ్యంగా క్వాలిఫయర్ దశ నుంచే ఔటయింది. క్వాలిఫయర్ మ్యాచ్ లకు వేదికైన జింబాబ్వే వరుసగా రెండో సారీ ప్రపంచ కప్ నకు దూరమైంది.

కాగా, భారత్ లో జరిగే ప్రపంచ కప్ నకు శ్రీలంక 9వ జట్టుగా, నెదర్లాండ్స్ 10వ జట్టుగా రానున్నాయి. గత కప్ నకు నేరుగా వచ్చిన మాజీ చాంపియన్ లంక ఇప్పుడు క్వాలిఫయర్ ఆడాల్సి వచ్చింది. ఇక నెదర్లాండ్స్ అనూహ్యంగా స్కాట్లాండ్ ను ఓడించి మెగా టోర్నీ గడపతొక్కబోతోంది.

పాల్గొనేది ఈ జట్లే

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్, ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తో పాటు శ్రీలంక, నెదర్లాండ్స్ ప్రపంచ కప్ ఆడనున్నాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి అర్హత సాధించలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ కాబట్టి ఒక్కో జట్టు 9 జట్లతో తలపడాల్సి ఉంటుంది. అంటే ప్రతి జట్టు మిగతా జట్టును ఎదుర్కొంటుంది.

పాక్ మ్యాచ్ లు హైదరాబాద్ లో

ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పాల్గొంటుందా? లేదా? అనేది వదిలేస్తే.. ఆ జట్టు ఆడే మ్యాచ్ లు 2 హైదరాబాద్ లోనే జరగనున్నాయి. ఇందులో క్వాలిఫయర్ 1 అంటే శ్రీలంకతో పాక్ ఉప్పల్ లో తలపడుతుంది. నెదర్లాండ్స్ తోనూ ఇక్కడే ఆడనుంది. న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. మరో మ్యాచ్ ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మధ్య జరగనుంది.