Begin typing your search above and press return to search.

విమానంలో ఖాళీ లేదని.. నిలబెట్టి తీసుకెళ్లారు!

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:11 PM GMT
విమానంలో ఖాళీ లేదని.. నిలబెట్టి తీసుకెళ్లారు!
X
అవును. మ‌న‌ సిటీ బ‌స్సుల్లో, రైళ్ల‌లో చూసే సీన్ ఇప్పుడు విమానంలో జరిగింది. బ‌స్సుల్లో, రైళ్ల‌ల్లో ఎలాగైతే సీట్లు లేక‌పోతే నిల‌బెట్టి మ‌రీ ప్ర‌యాణం చేపిస్తారో అలాగే విమానంలో నిల‌బెట్టి జ‌ర్నీ చేయించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఏడుగురు ప్ర‌యాణికుల‌ను ఇలా క‌రాచీ నుంచి మ‌దీనాకు ఓ ప‌క్క‌న నిల్చోబెట్టి తీసుకువెళ్లింది.

పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రికలో రావడంతో వార్త రావ‌డంతో ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి సారి ఇలా ప్ర‌యాణికుల‌ను విమానంలో తీసుకువెళ్లిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం సంఘ‌ట‌న‌పై పైల‌ట్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం విమానం త‌లుపులు మూసే ముందు ప‌రిమితికి మించి ఎవ‌రైనా ఉంటే చెప్పాల్సి ఉంటుంద‌ని కానీ అలా చేయ‌లేద‌ని పైలట్ అన్నారు. తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత చూస్తే కొంతమంది అదనంగా కనిపించారని, దీంతో ఏం చేయాలో తోచ‌లేద‌న్నారు. వెనక్కి తీసుకెళ్లి కరాచీలో లాండ్ చేద్దామంటే అందుకు చాలా ఇంధనం వృథా అవుతుందని, అది తమ విమానయాన సంస్థ ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి అలాగే తీసుకెళ్లిపోయానని ఆ పైలట్ చెప్పినట్లు మీడియా సంస్థ వివ‌రించింది.

కానీ ఈ ప‌రిణామంపై విమానయాన రంగ నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ప‌రిమితికి మించి తీసుకువెళ్తే చాలా సమస్యలు వస్తాయని, అత్యవసర ప‌రిస్థితులు ఎదురైతే...ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు తగినంతగా ఉండవని చెబుతున్నారు. మ‌రోవైపు ఈ వార్త ప్ర‌పంచవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అదికార ప్రతినిధి దన్యల్ గిలానీ స్పందించారు. సీట్లన్నీ నిండిపోయిన తర్వాత కూడా ఆ విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనని అంగీక‌రించారు. ప్రయాణికులను నిలబెట్టి ఎలా తీసుకెళ్లారన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కొస‌మెరుపు ఏమిటంటే...ఇంత టెక్నాల‌జీమ‌యం అయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ ఏడుగురికి చేత్తో రాసిన బోర్డింగ్ పాసులు ఇచ్చి విమానం ఎక్కించార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/