Begin typing your search above and press return to search.

యాదాద్రి ప్రారంభం కావటం.. ఆ వెంటనే కేటీఆర్ కు సీఎం కుర్చీ

By:  Tupaki Desk   |   23 Jan 2021 4:56 AM GMT
యాదాద్రి ప్రారంభం కావటం.. ఆ వెంటనే కేటీఆర్ కు సీఎం కుర్చీ
X
మిగిలిన వారికి భిన్నంగా మంత్రి కేటీఆర్ హాజరైన కార్యక్రమంలో.. ఆయన ఎదుటే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. కాబోయే సీఎంకు ముందస్తు శుభాకాంక్షలన్న వ్యాఖ్య చేయటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు పలువురు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ పరోక్షంలో ఆయన ముఖ్యమంత్రికుర్చీలో కూర్చోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా పద్మారావు మాత్రం నేరుగా సీఎం అవుతారన్న వ్యాఖ్యలు చేయటం.. దానికి కేటీఆర్ ఎలాంటి రియాక్షన్ ను ప్రదర్శించకుండా ఉండిపోయారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత పద్మారావుతో మాట్లాడుతూ వెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా అదే పద్మారావు మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవీ బాధ్యతల్ని చేపడతారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. అధిష్ఠానం చెప్పమన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ తనదైన ముద్ర వేస్తున్నందున ఆయన త్వరలోనే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. యాదాద్రిని గొప్ప అథ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ కల అని.. ఆ దేవాలయం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి హరీశ్ రావు పని చేశారని.. ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది కేసీఆరే తీసుకోవాలన్న ఆయన.. కేటీఆర్ సీఎం కావటంపై ఇతర పార్టీల విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జాతీయరాజకీయ పార్టీల్లో ఐదు తరాలుగా వారసత్వ రాజకీయాల్ని నడుపుతున్నారని.. అలాంటిది తమ పార్టీలో రెండో తరానికే సీఎం కాకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నుంచి రాహుల్ వరకు వారసత్వ రాజకీయాల్ని నడుపుతుండగా లేనిది.. తమను తప్పు పట్టొద్దన్నారు. మొత్తానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడన్న విషయంలో పద్మారావు మరింత క్లారిటీ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.