Begin typing your search above and press return to search.

లెక్క ఎక్కడ తప్పుతోంది..?

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:55 AM GMT
లెక్క ఎక్కడ తప్పుతోంది..?
X
ఏపీ ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు - కేంద్రం చెప్తున్న లెక్కలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అది పోలవరం విషయంలోనైనా - రెవెన్యూ లోటు విషయంలోనైనా ఎంతో తేడా కనిపిస్తోంది. దీంతో కేంద్రం ఇంకా ఏదో ఇస్తుందన్న ఆశతో ఏపీ ఖర్చులు చేస్తుండడం... కేంద్రం కనికరించకపోవడంతో సంఘర్షణ తప్పడం లేదు. తాజాగా ఏపీ రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం మరోసారి చాలా క్లియర్ గా తమ లెక్కలన్నీ చెప్పింది.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 4,118 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్‌ సమాధానమిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఈ రెవెన్యూ లోటు భర్తీ చేసే క్రమంలో తాము ఇప్పటికే ప్రత్యేక సహాయం పేరుతో రూ. 3,980 కోట్లు విడుదల చేశామని తెలిపారు. దీంతో పాటు 2015-2020 మధ్యకాలానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ. 22,212 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసి, ఆ మేరకు కేటాయింపులను సిఫార్సు చేసిందని వివరించారు. గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 14,862 కోట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించిందని వెల్లడించారు. రానున్న మిగతా రెండేళ్లలో మిగతా లోటును కూడా భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.

కాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ఈ గణాంకాల ద్వారా రెవెన్యూలోటుపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల్లో భారీ వ్యత్యాసం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటును రూ. 16,000 కోట్లుగా అంచనా వేస్తూ వచ్చింది. ఈ మేరకు కేంద్రం లోటును భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ అంచనాలు - గణాంకాల ప్రకారం రూ. 4,118 కోట్లు మాత్రమే అని చెబుతూ ఇంకా కేవలం రూ. 138 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని చెప్పడంతో ఏపీ ప్రభుత్వానికి ఏమీ పాలుపోవడం లేదట.