Begin typing your search above and press return to search.

అందాన్ని చూపించేందుకే గుళ్ల‌కు వెళుతున్న మ‌హిళ‌లు

By:  Tupaki Desk   |   12 Oct 2018 1:30 AM GMT
అందాన్ని చూపించేందుకే గుళ్ల‌కు వెళుతున్న మ‌హిళ‌లు
X
క‌మ్యూనిస్టు నాయ‌కులంటే దైవ‌భ‌క్తికి దూరంగా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఆధ్యాత్మిక‌తకు సంబంధించిన అంశాల‌తో వారు విబేధిస్తుంటారు. దానికి భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అనే పేరుపెట్టుకుంటుంటారు. అయితే, ఈ రూపంలో ఇత‌రుల‌ను అవ‌మానం పాలు చేయ‌డం ఎందుకనే ప్ర‌శ్న స‌హ‌జంగానే త‌లెత్తుతుంది. ఇలా ఇప్ప‌టికే ఎన్నో ఉదంతాలు చోటుచేసుకోగా...తాజాగా కోట్లాదిమంది హిందువులు - మ‌హిళ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినే కామెంట్ల‌ను ఓ వామ‌ప‌క్ష నేత చేశారు. స‌ద‌రు వ్య‌క్తి మ‌హిళ కావ‌డం...ఆమె చేసింది కూడా మహిళ‌ల‌పై అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు కావ‌డంతో ఆమె తీరు తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

శబరిమల అయ్య‌ప్ప‌ స్వామి దర్శనానికి మహిళలు కూడా వెళ్ళవచ్చుఅంటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని తీవ్ర అవ‌మాన‌క‌ర‌మైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లోని కోనేరులో స్నానం చేసే మహిళలు తడిసిన దుస్తులతో అంగాంగ ప్రదర్శనకే మొగ్గు చూపుతున్నారని జుగుప్సాక‌ర‌మైన మాట‌లు మాట్లాడారు. ఇక త‌మ రాజ‌కీయ అజెండా గురించి పేర్కొంటూ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ఆరోపించారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న శ్రీమతి.. సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ రూపుమాపిందని శ్రీమతి అన్నారు.

కాగా, సీపీఎం ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లపై ఇటు సీపీఎం పార్టీ కానీ అటు మ‌హిళా ఎంపీ కానీ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. హిందూ మ‌తాన్ని ద్వేషించ‌డం ల‌క్ష్యంగా చేసిన కామెంట్ల‌పై స్పందించ‌క‌పోవ‌డం ఆ పార్టీ తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డుతున్నారు. ఇత‌ర మ‌త‌స్తుల విష‌యంలో కామెంట్లు చేసేందుకే జంకే వామ‌ప‌క్ష నేత‌లు ఇలా హిందువుల గురించి అస‌భ్యంగా, జుగుప్సాక‌రంగా ఎలా మాట్లాడుతార‌ని ప‌లువురు హిందుత్వ వాదులు సోష‌ల్‌మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. హిందువుల‌ను ద్వేషించే అంశాల‌పై దృష్టి పెట్ట‌డం వ‌ల్లే వామ‌ప‌క్షాలు వామ‌పక్షాలు క‌నుమ‌రుగు అవుతున్నాయ‌ని పేర్కొంటున్నారు.