యూపీలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు హాస్పిటల్ యజమాని చేసిన ఓ నిర్వహం వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మాక్ డ్రిల్ పేరిట 5 నిముషాల్లో 22 మంది కరోనా రోగుల ప్రాణాలు తీశాడట. (అయితే, ఇంతమంది మరణించలేదని, అసలు ఎంతమంది మృతి చెందారో తెలియదని అంటున్నాడు). కరోనా రోగులకు ఆక్సిజన్ లేకపోతే ఎంతసేపటిలో, ఎంతమంది మరణిస్తారు. ఎందరు బతుకుతారో తెలుసుకునేందుకు ఇతగాడు భయంకర ప్రయోగమే చేశాడు.
చికిత్స పొందుతున్న కరోనా, నాన్-కరోనా వార్డుల్లోని రోగులకు 5 నిముషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాడు. అసలే, ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇలా ఓ ప్రయోగం చేసి చూద్దామనుకున్నాడట. మా హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదని చెబుతున్నా రోగుల తాలూకు బంధువులు డిశ్చార్జ్ చేయవద్దంటూ ప్రాధేయపడడంతో ఈ ప్రయోగానికి పూనుకొన్నామన్నాడు. ఏప్రిల్ 26 న తాము 5 నిముషాలపాటు ఆక్సిజన్ నిలిపివేయగా 22 మంది రోగుల శరీరాలు నీలి రంగులో మారాయని, శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడ్డారని అరింజయ్ జైన్ అనే ఈ హాస్పిటల్ యజమాని చెప్పాడు. దాంతో ప్రాణవాయువు లేక వీరు మరణించడం ఖాయమని తాము నిర్ధారించుకున్నామన్నాడు. మిగిలిన కొంతమంది రోగుల బంధువులను మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోవాలని సూచించామన్నాడు. ఇతగాడు చెప్పిన మాటల తాలూకు వీడియో ఆ మధ్య రిలీజయింది. ఈ మాక్ డ్రిల్ లో నలుగురు రోగులు ఏప్రిల్ 26న, ముగ్గురు 27 న మృతి చెందారని చెప్పాడు..మరి 22 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయనగా ఎంతమంది మృతి చెందిందీ తనకు తెలియదన్నారు. అయితే ఈ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించినప్పటికీ, తన చెప్పినదానిని మరో రకంగా అన్వయించుకున్నారని జైన్ చెప్పాడు. ఈ హాస్పిటల్ లో రోగుల మృతి. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆగ్రా వైద్య అధికారి ఓ కమిటీని నియమించారు.