Begin typing your search above and press return to search.

పాత య‌జ‌మాని క‌రెంటు బిల్లు ఎగ్గొడితే.. ఏం చేయాలి.. ?  : ఇదిగో సుప్రీంకోర్టు తాజా తీర్పు

By:  Tupaki Desk   |   20 May 2023 9:46 PM GMT
పాత య‌జ‌మాని క‌రెంటు బిల్లు ఎగ్గొడితే.. ఏం చేయాలి.. ?  : ఇదిగో సుప్రీంకోర్టు తాజా తీర్పు
X
మ‌నం ఏదైనా ఇల్లు కొనుగోలు చేశాం అనుకోండి. అప్ప‌టికే ఆ ఇంట్లో ఉన్న‌వారు.. ఇంటిప‌న్ను.. కుళాయి ప‌న్ను.. వంటివిచెల్లించాలి. అదేస‌మ‌యంలో విద్యుత్ బిల్లుల‌కు సంబంధించిన రుసుముల‌ను కూడా క్లియ‌ర్ చేసి ఇవ్వాలి. వీటిలో అంద‌రూ సాధార‌ణంగా మ‌రిచిపోయే విష‌యం విద్యుత్ బిల్లులు. ఎందుకం టే.. మిగిలిన ఇంటి ప‌న్ను, కుళాయి ప‌న్ను వంటివి.. ఇంటి డాక్యుమెంట్లు చేసుకునే స‌మ‌యంలో చెల్లిస్తారు. అవి చెల్లించ‌క పోతే.. రిజిస్ట్రేష‌న్ చేయరు కాబ‌ట్టి.. అంద‌రికీ వాటిపై దృష్టి ఉంటుంది.

మ‌రి క‌రెంటు బిల్లు విష‌యం? ఇదే.. పెద్ద స‌మ‌స్య‌. కొత్త‌గా కొనేవారు పొర‌పాటునో.. గ్ర‌హ పాటునో.. ఈ బిల్లు విష‌యంలో మ‌రిచిపోయార‌నుకోండి.. అప్ప‌టికే వారికిఆ ఇల్లు సొంత‌మైన నేప‌థ్యంలో క‌రెంటు ఆఫీసు నుంచి తాఖీదులు వ‌స్తాయి. బ‌కాయి బిల్లులు చెల్లించాల‌ని కూడా డిమాండ్ చేస్తారు. దీంతో అరెరె.. మాకు సంబంధం లేదు. వారు క‌దా! క‌రెంటు వాడుకుంది! అని చెప్పి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ.. తాజాగా ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

ఎవ‌రైనా పాత య‌జ‌మాని క‌నుక క‌రెంటు బిల్లు చెల్లించ‌కుండా వెళ్లిపోతే.. ఆ భారాన్ని కొత్త‌గా ఇల్లు కొన్న‌వా రు భ‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. అంటే.. వారు ఎగ్గొట్టిన బిల్లును కొత్త‌వారు క‌ట్టి తీరాల‌న్న‌మాట‌. ఇది కొంత చిత్రంగాను.. బాధ‌గాను ఉన్న‌ప్ప‌టికీ.. విద్యుత్ చ‌ట్టాలు ఇవే చెబుతున్నాయ‌న్న‌ది సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న సారాంశం.

ఏం జ‌రిగింది?

పాత యజమానులు బిల్లలు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు తమ ఇళ్లకు విద్యుత్ నిలిపేశారని చెబుతూ.. కేర‌ళ‌రాష్ట్రానికి చెందిన 19 మంది వినియోగ‌దారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మాట్లాడుతూ.. 2003 విద్యుత్ చట్టం(ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉంటుంది)లోని సెక్షన్ 43 ప్రకారం విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి కాదని తెలిపారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రా అనేది.. పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి చేసుకునే దరఖాస్తుకు అనుగుణంగా ఉంటుందని, 1948 నాటి చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం విద్యుత్ సరఫరా చేయాలంటే పాత యజమాని బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి అని, పాత బకాయిల ను కొత్త యజమాని నుంచి వసూలు చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ స‌ర‌ఫ‌రా కోడ్ వీలు కల్పిసుందని సుప్రీంకో ర్టు పేర్కొంది.

మొత్తానికి కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్(కేఎస్ఈబీ)కి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంకేముంది.. 19 మంది వినియోగ‌దారులు కూడా.. పొలో మంటూ.. పాత య‌జ‌మానుల‌ను తిట్టుకుంటూ.. బిల్లులు క‌ట్టేందుకు రెడీ అయ్యారు. మ‌రి ఇది.. ఆ రాష్ట్రానికేప‌రిమిత‌మా? అంటే కాదు.. సుప్రీంకోర్టు తీర్పు.. శిలా శాస‌నం కాబ‌ట్టి.. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తుంది. సో.. కొత్త‌గా ఇళ్లు కొనేవారు.. ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌డం మంచిద‌న్న‌మాట‌.