Begin typing your search above and press return to search.

ఏడాది పూర్తి.. కశ్మీర్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   5 Aug 2020 7:30 AM GMT
ఏడాది పూర్తి.. కశ్మీర్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
X
ఉన్నట్లుండి కశ్మీర్ గురించి ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందంటారా? దానికో కారణం ఉంది. గత ఏడాది ఇదే రోజున మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేయటమే కాదు.. జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని రెండుకేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటివరకు జమ్ముకశ్మీర్ ఇష్యూను.. ఆర్టికల్ 370ను టచ్ చేయటాలంటే వణికే ప్రభుత్వాలకు భిన్నంగా మోడీ సర్కారు సాహసోపేతంగా వ్యవహరించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సహజంగానే కశ్మీర్ వ్యాలీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విపక్షాల్లో కొందరు విరుచుకుపడితే.. మరికొందరు మౌనంగా ఉండిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో అనుసరించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుండగానే కేంద్రం తన నిర్ణయాన్ని తీసుకొని ఏడాదైంది. మరి.. ఇలాంటి వేళలో ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అన్నది ప్రశ్న.

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటానికి ముందు.. ఆ రాష్ట్రం చేపట్టిన చర్యలు చాలానే ఉన్నాయి. పెద్ద ఎత్తున భద్రతా బలాగాల్ని తరలించటంతో పాటు.. రాష్ట్రానికి చెందిన అతివాద నాయకుల్ని హౌస్ అరెస్టు చేశారు. ఫోన్.. ఇంటర్నెట్ లాంటి సౌకర్యాల్ని బంద్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చర్యల్ని చేపట్టారు. ఏడాది గడిచిన తర్వాత కూడా కశ్మీర్ వ్యాలీలో పరిస్థితి అంతగా మెరుగు పడలేదని చెబుతారు. కరోనా దీనికి తోడు కావటం కాస్త ఇబ్బందిగా మారిందని చెబుతారు. పారామిలటరీ దళాలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయటంపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

దీనికి తోడు కశ్మీరీ స్థానికేతరులకు డొమెసిల్ చట్టం ద్వారా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాల్ని అందజేయటంపై కశ్మీరీలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక.. అక్కడే సుదీర్ఘ కాలం పని చేసిన పారామిలటరీ దళాల జవాన్లకు సైతం స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయటంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కశ్మీరీల కోణంలో కాకుండా.. భారతదేశంలో కశ్మీర్ ను భాగంగా చూసినప్పుడు మాత్రం ఈ విధానం మంచిదేనని చెప్పక తప్పదు.

ఎందుకంటే..కశ్మీరీలు దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో.. పట్టణాల్లో నివసిస్తున్నారు. వారెవరిని ఆయా నగరాల్లో.. పట్టణాల్లో మిగిలిన వారికి భిన్నంగా చూడటం లేదు కదా? అలాంటప్పుడు కశ్మీర్ లో ఉండాలనుకునే వారి విషయంలో కశ్మీరీలు అభ్యంతరం చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి.