Begin typing your search above and press return to search.

బ్యాక్ సీటు డ్రైవింగ్ : షిండెకు సీఎం... విమర్శలకు చెక్...?

By:  Tupaki Desk   |   30 Jun 2022 12:16 PM GMT
బ్యాక్ సీటు  డ్రైవింగ్  : షిండెకు సీఎం... విమర్శలకు చెక్...?
X

బీజేపీ రాజకీయం క్లైమాక్స్ లో అదిరిపోయింది. కొద్ది గంటల ముందు వరకూ మహా రాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం మాస్టర్ స్ట్రోక్ తో మొత్తం సీన్ మార్చేసింది. విపక్షాలకు ఊపిరి ఆడకుండా దెబ్బ కొట్టింది. మహారాష్ట్రలో శివసేన సర్కార్ ని కూలగొట్టామన్న చెడ్డ పేరు తమకు రాకుండా జాగ్రత్తపడింది. అదే టైమ్ లో రెబెల్ లీడర్ ఏక్ నాధ్ షిండేను సీఎం ని చేయడం ద్వారా బ్యాక్ సీట్ డ్రైవింగ్ కి తెర తీసింది.

పైకి మామూలుగా కనిపిస్తున్నా బహుళ ప్రయోజనాలు ఆశించే బీజేపీ ఈ డెసిషన్ తీసుకుంది. నిజానికి టోటల్ ఎపిసోడ్ లో షిండేది అసలైన కష్టం. శివసేనను చీల్చడంలో ఆయనదే ముఖ్య పాత్ర . తీరా ఇంతా చేసినా ఆయనకు డిప్యూటీ సీఎం అంటే ఎందుకు ఈ ప్రయాస అని ఇవాళ కాకపోయినా రేపు అయినా అనుకుంటారు. ఆ తరువాత కొన్నాళ్ళకు మరాఠా యోధుడు శరద్ పవార్ పావులు కదిపి నీవే సీఎం షిండే అంటే మళ్ళీ కధ మొదటికి వస్తుంది.

బీజేపీకి సర్కార్ ని కూల్చామన్న మచ్చ మిగులుతుంది. అధికారం ఎటూ కాకుండా పోతుంది. ఇక మొత్తం రెబెల్స్ 40 మంది దాకా ఉన్నారు. ఫడ్నవీస్ సీఎం అయితే వారందరికీ మంత్రి పదవులు దక్కవు. దాంతో అలా నిరాశ చెందిన వారు తిరిగి శివసేన గూటికి చేరితే మూన్నాళ్ళ ముచ్చటగానే బీజేపీ సర్కార్ పుట్టె మునుగుతుంది.

ఇంకో వైపు చూస్తే శివసేన ఇంకా ఉనికిలో ఉంది. షిండేను తమ వాడిగా చేసుకుని ముఖ్యమంత్రిని చేయకపోతే రేపో నేడో ఆయన వెళ్ళి ఉద్ధవ్ తో రాజీ పడితే అది కూడా ప్రమాదమే. ఇక బీజేపీకి సీఎం పదవి ముఖ్యం కాదు, మహారాష్ట్ర రాజాకీయాన్ని గుప్పటి పట్టడం, హిందూత్వ నినాదాన్ని తమతో కలసి పంచుకోకుండా శివసేనను ఏమీ కాకుండా చేయడం కావాలి. ఆ పని చేసి శివసేనను రాజకీయాల్లో లేకుండా చేస్తేనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అయినా ఫుల్ మెజారిటీ వస్తుంది.

ఈ పని చేయాలీ అంటే షిండే గద్దె మీద ఉండాలి. నిజానికి షిండేది సీఎం కావాలన్నది బలమైన కోరిక. ఈ రోజుకు అణచుకుని ఆయన బీజేపీ కూటమిలో డిప్యూటీగా చేరినా రేపటి రోజునా జెండా ఎత్తేస్తే అపుడు మరింత కంపు అవుతుంది. అందుకే షిండేని తమ వాడిగా చేసుకుని వీలైతే రానున్న కాలంలో ఆయన్ని బీజేపీ మనిషిగా కూడా చేసుకునే యత్నంలో తొలి మెట్టే సీఎం పదవి ఎర.

ఇక షిండే సీఎం అయినా ఎటూ అధికారం బీజేపీ చేతిలోనే ఉంటుంది బ్యాక్ సీటు డ్రైవింగ్ తో బీజేపీయే కధ మొత్తం నడిపిస్తుంది. అందువల్ల తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి. ఉద్ధవ్ సర్కార్ ని కూల్చామన్న అప్రప్రధ రాదు, మరోసారి రెబెల్స్ లో చీలిక కూడా రాదు. అందుకే అందరికీ మంత్రి పదవులు ఇస్తూ మొత్తం రెబెల్స్ తోనే ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తూ బీజేపీ అసలైన అధికారాన్ని తమ దగ్గర ఉంచుకుంటోంది అన్న మాట. ఈ మాస్టర్ స్ట్రోక్ కి మరాఠా యోధుడు పవార్ కి దిమ్మ దిరిగితే ఇక జీవితంలో సీఎం కాలేను శివసేన ఫ్యూచర్ ఏంటి అని కంగారు పడాల్సిన పరిస్థితి ఉద్ధవ్ థాక్రేది.