సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి లలిత్ గురించి మీకు తెలియని విషయాలివే!

Wed Aug 10 2022 20:33:35 GMT+0530 (IST)

new Chief Justice of the Supreme Court Lalit

భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన స్థానంలో జస్టిస్ యు.యు.లలిత్ పేరును సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం యు.యు.లలి™Œ భారత సుప్రీంకోర్టు 49వ సీజేఐగా ఎంపికయ్యారు. ఆయన నియామక పత్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు. ఆగస్టు 27న ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన కేవలం మూడు నెలలకన్నా తక్కువ సమయమే సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్ 8తో జస్టిస్ యు.యు.లలిత్‌కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే అందుకు కారణం.కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా యు.యు.లలిత్ 2014 ఆగస్టు 13న బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సీజేఐగా బాధ్యతలు చేపడితే బార్ నుంచి ఆ స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. గతంలో 1971 జనవరిలో 13వ సీజేఐ జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ సైతం ఇలాగే బార్ నుంచి వచ్చారు.

ఒక న్యాయవాదిగా లలిత్ ఎన్నో ఉన్నతస్థాయి క్రిమినల్ కేసులు వాదించారు. 2011లో 2జీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు లలిత్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 1983 జూన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1986 నుంచి 2004 వరకు న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ న్యాయసేవల ప్రాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు.

మహారాష్ట్రకు చెందిన జస్టిస్ యు.యు.లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజుల స్వల్పకాలం మాత్రమే కొనసాగుతారు. నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన తండ్రి యూఆర్ లలిత్ కూడా సీనియర్ న్యాయవాదే కావడం గమనార్హం
2019లో జస్టిస్ లలిత్ అయోధ్య కేసు విచారణ నుంచి వైదొలిగారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన తరఫున వాదించిన ఉదంతాన్ని చూపుతూ ఆయన ధర్మాసనం నుంచి వైదొలిగారు.

త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో లలిత్ సభ్యులుగా ఉన్నారు. తిరువనంతపురంలోని శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయ పరిపాలన బాధ్యతలను ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నుంచి కోర్టు నియమించిన పరిపాలన కమిటీకి అప్పగించాలని తీర్పు చెప్పిన ధర్మాసనానికి నేతృత్వం వహించారు. అలాగే ఇటీవల తాను సుమోటోగా చేపట్టిన కేసులో మరణశిక్షలను తగ్గించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

వస్త్రాలపై తాకితే లైంగికదాడి కిందికి రాదని దానికి ‘స్కిన్ టు స్కిన్’ సంబంధం ఉండాలని బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం ఇచ్చిన వివాదాస్పద తీర్పును లలిత్ కొట్టేశారు. లైంగిక వ్యామోహంతో చిన్న పిల్లలతో ఎలాంటి భౌతిక సంబంధం పెట్టుకున్నా పోక్సో చట్టం ప్రకారం నేరం కిందికే వస్తుందని.. నేరుగా శరీరాన్నే తాకాల్సిన అవసరం లేదని కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.