Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను తిడితే పెద్ద లీడర్లు కాదన్న కేటీఆర్.. మరి మీరు చేసేదేంటి చిన్నసారూ?

By:  Tupaki Desk   |   17 Jun 2021 2:30 PM GMT
కేసీఆర్ ను తిడితే పెద్ద లీడర్లు కాదన్న కేటీఆర్.. మరి మీరు చేసేదేంటి చిన్నసారూ?
X
ఎప్పటికప్పుడు తనకు సరిపోయేలా వ్యాఖ్యలు చేయటం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అలవాటే. సమయానికి అనుకూలంగా ఆయన చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా తమ ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. వారంతా అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికి పట్టించుకోకుండా విమర్శలు గుప్పించటం లాంటివి మంత్రి కేటీఆర్ కు అలవాటే.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అత్యంత ప్రేమించే ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు అయిపోరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని కొందరు సీఎం కేసీఆర్ ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా తిట్టే పిచ్చివాళ్లకు మీరే గుణపాఠం చెప్పాలని పార్టీ కార్యకర్తలకు.. ప్రజలకు పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్ చెప్పింది నిజమే అనుకుందాం. మరి.. ప్రధాని మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసే విమర్శల మాటేమిటి? ఒకవేళ మోడీపై తీవ్ర విమర్శలు చేయాలంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేయటంలో అర్థమేమిటి? సామాన్యులకు ఒక రూల్.. మంత్రి కేటీఆర్ కు మరో రూల్ అంటూ ఉండదు కదా?

ఎవరి స్థాయి వారికి ఉంటుందని.. స్థాయికి మించిన విమర్శలు సరికాదన్నప్పుడు.. అదే సూత్రం మంత్రి కేటీఆర్ కు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని ఆయన ఎందుకు మర్చిపోతారు? ఆ మాటకు వస్తే.. కేటీఆర్ ఇప్పుడు మంత్రి కానీ.. ఉద్యమ సమయంలో ఆయనకు ఎలాంటి పదవి లేదు. అయినప్పటికీ ఆయన తనకు తోచినట్లుగా.. తోచిన వారి మీద ఘాటు విమర్శలు చేశారు. తాను నడిచి వచ్చిన దారిని స్ఫూర్తిగా తీసుకొని విమర్శలు చేస్తుంటే మంత్రి కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నట్లు? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.