Begin typing your search above and press return to search.

లోకేష్ ఓకే...ఫస్ట్ రివ్యూ బాగుంది...ఇంకా చాలా ఉంది...!

By:  Tupaki Desk   |   2 Feb 2023 11:00 PM GMT
లోకేష్ ఓకే...ఫస్ట్ రివ్యూ బాగుంది...ఇంకా చాలా ఉంది...!
X
నారా లోకేష్ తెలుగుదేశం మూడవ తరం నాయకుడు. అన్న నందమూరి ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ. పద మూడేళ్ల పాటు తారక రామారావు తనదైన శైలిలో తీర్చిదిద్దారు. అక్కడ నుంచి గత 27 ఏళ్ళుగా చంద్రబాబు తన భుజ స్కందాల మీద ఆ భారాన్ని మోస్తున్నారు. బాబు వయసు ఇపుడు ఏడున్నర పదులకు చేరువ అవుతోంది. దాంతో పాటు నాలుగు పదుల వయసులో పడిన తెలుగుదేశానికి నవ నాయకత్వం కావాలి.

దాదాపుగా అంతే వయసు ఉన్న లోకేష్ మూడవ తరంలో సారధ్య బాధ్యతలు స్వీకరించడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. పార్టీ జనాలు సగటు జనాలు ఆమోదముద్ర వేయాల్సిన తరుణం ఇది. బలవంతంగా రుద్దితే నాయకుడు కాలేరు. దాంతో లోకేష్ ని పాదయాత్ర చేయడానికి చంద్రబాబు అనుమతించారు. యువకుడు అయిన లోకేష్ పాదయాత్ర చేయడం ద్వారా తనను తాను రుజువు చేసుకొవాలి. నాయకుడిగా నిలబడాలి. అలాగే పార్టీని అధికారంలోకి తేవాలి.

ఇలా కీలక టార్గెట్లు పెట్టుకుని బరిలోకి దిగిన లోకేష్ పాదయాత్ర నెమ్మదిగా పదవ రోజుకు దగ్గర పడుతోంది. మరి పాదయాత్ర ఎలా ఉంది. లోకేష్ తీరు ఎలా ఉంది అన్నది కనుక చూసుకుంటే పార్టీ వర్గాలు లోకేష్ ఓకే అని అంటున్నాయి. ఆయన పాదయాత్ర ద్వారా ఇప్పటికైతే బాగానే రాణిస్తున్నారు అని అంటున్నారు. తొలి రోజున కుప్పంలో రాష్ట్రం నలుమూలల నుంచి అశేష జనాలు విశేషంగా హాజరయ్యారు. లోకేష్ ఎపుడు ఏది మాట్లాడినా తడబడుతూ ఉంటారు.

కానీ కుప్పం మీటింగులో మాత్రం నలభై అయిదు నిముషాల పాటు బాగానే మాట్లాడారు అనిపించారు. ఆ తరువాత ఆయన స్థానిక జనాలను కలుస్తూ మీటింగులు పెడుతూ వైసీపీ ప్రభుత్వం మీద పంచ్ డైలాగులు పేలుస్తూ బాగానే ముందుకు పోతున్నారు. ఒక విధంగా లోకేష్ దూకుడు పెంచారని తమ్ముళ్ళు అంటున్నారు. వైసీపీ నేతల నోటికి పని చెప్పేలా చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక సుదీర్ఘమైన పాదయాత్ర ఉంది. నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటల్రు, 125 నియోజకవర్గాలను టచ్ చేసుకుంటూ సాగాలి. ప్రస్తుతానికి అయితే పాదయాత్రకు పెద్దగా ఇబ్బంది లేదు, సజావుగానే సాగుతోంది తొలి రోజున తారకరత్న గుండెపోటుతో పడిపోవడం ఘటన తప్పించి మరేదీ అపశృతి అన్నది లేదు. దాంతో లోకేష్ పాదయాత్ర నెమ్మదిగా సాగుతోంది.

చంద్రబాబు సైతం తాను పాదయాత్రకు దూరంగా ఉంటూ డైరెక్షన్ కే పరిమితం అయ్యారు. తాను వస్తే పూర్తి అటెన్షన్ తన మీదనే ఉంటుందని, ఆ విధంగా తన వైపు ఫోకస్ పడితే లోకేష్ ఎలివేట్ కాడని వ్యూహాత్మకంగానే తెర వెనక ఉన్నారని అంటున్నారు. లోకేష్ తానుగానే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని రాటుదేలాలని బాబు భావిస్తున్నారు. పార్టీ జనాలూ అదే కోరుకుంటున్నరు. లోకేష్ అయితే ఇప్పటికి ఓకే అనిపించారు. పాదయాత్ర ద్వారా లోకేష్ ఎంత మేరకు సక్సెస్ అయ్యారన్నది పూర్తిగా ఈ యాత్ర సాగితేనే తెలుస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.